ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

ఎన్నికల రాజకీయాలలో సామాజిక మాధ్యమం

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

సామాజిక మాధ్యమాలలో "పౌరుల హక్కులను పరిరక్షించడం" కోసం చర్చించడానికి అనురాగ్ ఠాకూర్ నాయకత్వంలోని 31 మంది తో కూడిన పార్లమెటరీ కమిటీ "ట్విట్టర్" ప్రధాన కార్య నిర్వహణాధికారి జాక్ డోర్సేను పిలిపించింది. ట్విట్టర్ అనేక "అనుమానాస్పద" ఖాతాలను తొలగించడమే దీనికి కారణం అనుకుంటున్నారు. ఫేస్ బుక్ లాంటి ఇతర సామాజిక మాధ్యమాల బాధ్యులతో కూడా ఈ అంశం చర్చించాలని బీజేపీ సీనియర్ నాయకుడు లాల్ కృష్ణ అద్వాణీ కూడా కోరారు.

2019 సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ ప్రస్తుత ప్రభుత్వం సామాజిక మాధ్యమాల మీద ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఎన్నికల రాజకీయాలలో సామాజిక మాధ్యమం పాత్ర గురించి పరిశీలించవలసిందే. కాని ఈ పరిశీలన "గుడ్డిగా" ఉండకూడదు. డిజిటల్ మాధ్యమాలు దేశంలో ప్రజా రంగాన్ని మౌలికంగా మార్చేశాయి. "వార్తా సేకరణ"లో మౌలికమైన మార్పులు వచ్చాయి. ముద్రణా మాధ్యమం, దృశ్య శ్రవణ మాధ్యమమైన టెలివిజన్, సామాజిక మాధ్యమాలు పరస్పరం ఆధారపడుతున్నాయి. అయితే నిర్మాణాత్మకమైన ఈ మార్పులు ప్రజా జీవన రంగాన్ని ఏ మేరకు ప్రభావితం చేస్తాయి? అవి ఓట్లుగా మారతాయా? మన దేశంలో సామాజిక-ఆర్థిక, సాంస్కృతిక అంతరాల  కారణంగా డిజిటల్ సదుపాయాలు అందరికీ అందుబాటులో లేవు. అందువల్ల అవి క్షేత్ర స్థాయిలో వాస్తవాన్ని ప్రతిబింబింస్తాయా?

సామాజిక మాధ్యమం ఎన్నికలపై ప్రభావం చూపవచ్చునని డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కావడంతో రుజువైంది. అప్పుడు ఎన్నికల ప్రచారం, వేధింపులు, బూటకపు సమాచారం అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేశాయన్న ఆరోపణలున్నాయి. సామాజిక మాధ్యమాల ద్వారా వ్యక్తమయ్యే అభిప్రాయాలు ప్రభావం చూపుతాయి కనక ఈ సామాజిక మాధ్యమాలను నిర్వహించే కంపెనీలు ఇందులో తమ పాత్ర ఏమీ లేదని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ట్రంప్ ఎన్నిక కావడంలో ఫేస్ బుక్ అధిపతి మార్క్ జూకర్ బర్గ్ పాత్ర ఉందని తేలడంతో ఆయన ఇప్పుడు ఫేస్ బుక్ ను మరింత దాపరికం లేకుండా నిర్వహిస్తామంటున్నారు. మిగతా సామాజిక మాధ్యమాలూ ఇదే మాట చెప్తున్నాయి. ఫేస్ బుక్ లో రాజకీయ పక్షాల వ్యాపార ప్రకటనలు వినియోగ దార్లకు అందే పద్ధతిని ఇటీవల మార్చారు. విద్వేష ప్రచారాన్ని అరికట్టడానికి ట్విట్టర్ చర్యలు తీసుకుంటోంది. ట్విట్టర్ ఖాతాలను నిశితంగా పరిశీలిస్తోంది. మన దేశంలో రాజకీయ పార్టీలు సామాజిక మాధ్యమాలను ఎలా వినియోగించాలో ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేస్తోంది. ఎన్నికలలో అందరికీ సమానావకాశాలు ఉండేలా చూడడానికి ప్రయత్నిస్తోంది. అయితే ఇవన్నీ తాత్కాలిక చర్యలే తప్ప ఈ సమస్య తీవ్రతను పరిగణించడం లేదు. వాస్తవ ప్రపంచంలో ఎన్నికలు స్వేచ్ఛగా నిర్వహించడానికి డిజిటల్ ప్రజాస్వామ్యం ఏ మేరకు ఉండాలో ఆలోచించవలసి ఉంది.

సామాజిక మాధ్యమాలలో సమానావకాశాలు అంటే ఏమిటి? అంతర్జాలం అందరికీ సమానావకాశాలు ఇస్తుందని భావిస్తాం. కానీ కొందరు చెప్పే విషయాలు అందులో మరింత గట్టిగా వినిపిస్తున్నాయి. మరికొందరి అభిప్రాయాలకు అవకాశమే రావడం లేదు. అవకాశాలు అందరికీ సమానంగా ఉండవు కనక డిజిటల్ మాధ్యమాల్లో సమానావకాశాలకు చోటు లేదు. అది కేవలం మిథ్యే.

అనామకమైన ప్రైవేటు సంస్థలు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి సామాజిక మాధ్యమాలను మరింతగా వినియోగించుకోగలుగుతున్నాయి. అంతర్జాలంలో అందరి అభిప్రాయాలు ఒకే స్థాయిలో వ్యక్తం కావు. డిజిటల్ ప్రపంచంలో కొన్ని రాజకీయ పక్షాలు తమ మాటను మిగతా వారికన్నా ఎక్కువ శక్తిమంతంగా ప్రచారంలో పెట్టే అవకాశం ఉంటుంది కనక సమానావకాశాలు ఉండవు. దీనివల్ల రాజకీయాలలో నాణ్యత తగ్గుతుంది. పెద్ద రాజకీయ పక్షాలు డబ్బు ఖర్చు పెట్టగలుగాతాయి కనక ఆ అవకాశం లేని పక్షాలు అదే స్థాయిలో ప్రత్యర్థులను ఎదుర్కోలేవు. ఓటు బ్యాంకులను సమీకరించలేవు.

రాజకీయ పార్టీలు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం కోసం ఎంత డబ్బు ఖర్చు పెడ్తున్నాయో పరిశీలించగలమేమో కాని ఒక రాజకీయ పార్టీ పక్షాన వ్యక్తులు వెచ్చించే దాన్ని లెక్కగట్టగలమా? అందుకే డబ్బు ఖర్చు పెట్టగల రాజకీయ పార్టీలు ఎక్కువ ప్రచారం చేసుకోగలుగుతున్నాయి. సామాజిక మాధ్యమాల ద్వారా వ్యక్తమయ్యే విద్వేషపూరిత ప్రచారాన్ని అరికట్టే మార్గమే లేదు. సామాజిక మాధ్యమాలు ఒక సిద్ధాంతమూ కావు, ఆదర్శమూ కావు అన్న అంశాన్ని మనం విస్మరిస్తున్నాం. ప్రజాస్వామ్య ముసుగు వేసుకుని అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో వ్యాపార ధోరణీ ఉంది. నిజానికి ఇది "అభిప్రాయాల అంగడి"గా తయారైంది.

అంతర్జాలంలో అనామకంగా ఉండే అవకాశం ఉంది కనక ఇది వాక్ స్వాతంత్ర్యానికి ఉపకరిస్తుందనుకున్నాం. కానీ కులీన రాజకీయ వర్గాలు ఈ అనామకత్వాన్ని, పెట్టుబడిని, సాంకేతికతను రాజకీయ అభిప్రాయాలను మలచడానికి ఉపయోగించుకుంటున్నాయి. బూటకపు వార్తలు, తప్పుడు సమాచారం ప్రచారంలో పెడ్తున్నాయి. రాజకీయ ఎజెండాలను ప్రోది చేస్తున్నాయి. ఇది ఎన్నికల నైతికతకు, ముఖ్యంగా అతి పెద్ద ప్రజాస్వామ్యానికి ఉపకరించేది కాదు. ఈ తప్పులు సరిదిద్దడం సామాజిక మాధ్యమాలను నిర్వహించే వారికి, రాజకీయ పక్షాలకూ సాధ్యమయ్యేది కాదు.

అంతర్జాలం మన రాజకీయ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తోందో గమనించాలి. అప్పుడే కొత్త శాసన వ్యవస్థను రూపొందించగలం. మన భావ ప్రకటనా స్వేచ్ఛ అన్నింటికన్నా మించిందని గ్రహించగలం. సామాజిక మాధ్యమాలను నడిపే కంపెనీలు, రాజకీయ పక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించేట్టు చేయగలం. 

Back to Top