ప్రజాస్వామ్యంపై నిఘా నేత్రాలు
.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
మన ప్రజాస్వామ్యంపై నిఘా ఉంది. రాజ్యాంగ సూత్రాల ప్రకారం వ్యక్తులు వాక్ స్వాతంత్ర్యాన్ని, భావప్రకటనా స్వేచ్ఛను వినియోగించుకోవడం జాతీయ భద్రతకు విఘాతం కలిగిస్తుందనుకోలేం. ఇటీవల చాలా మంది భారతీయులపై "పెగాసస్" అనే సాఫ్ట్ వేర్ ద్వారా నిఘా పెట్టారు. ఇది వాట్స్ ఆప్ లో వచ్చే సమాచారంపై నిఘా వేసి ఉంచుతుంది. ఒక్క సారి ఈ సాఫ్ట్ వేర్ ను అమరిస్తే మొబైల్ ఫోన్లో ఉండే ఏ సమాచారంపైనైనా కన్నేసి ఉంచవచ్చు. ఆ ఫోన్ నుంచి చేసే ఫోన్లను, పంపే సందేశాలను, పాస్ వర్డులను, కాంటాక్ట్స్ జాబితాలను కూడా సంగ్రహించవచ్చు. ఈ సాఫ్ట్ వేర్ ఫోన్ కెమెరాను కూడా పని చేయించి పరిసరాల్లో జరుగుతున్న కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించవచ్చు.
"పెగసస్" ఇజ్రాయిల్ కు చెందిన ఎన్.ఎస్.ఒ. గ్రూపు టెక్నాజీస్ అధీనం లోనిది. ఈ సాఫ్ట్ వేర్ ను సౌదీ అరబియా ప్రజల మీద నిఘా వేసి ఉంచడానికి, భయ పెట్టడానికి, వారి కార్యకలాపాలను కనిపెట్టడానికి వినియోగించుకున్నది. అసమ్మతి వాది, వాషింగ్టన్ పోస్ట్ లో వ్యాసాలు రాసే జమాల్ కషొగ్గి మీద ఈ సాఫ్ట్ వేర్ ను వినియోగించుకున్నారు. 2018 లో ఇస్తాంబుల్ లో ఆయనను సౌదీ అరబియా దౌత్య కార్యాలయం దగ్గర హతమార్చారు. మన దేశంలో పెగాసస్ ను వినియోగిస్తున్నారా అన్న అంశంపై పార్లమెంటులో భారత ప్రభుత్వం కప్పదాటు సమాధానాలతో సరిపుచ్చుకుంది. జాతీయ భద్రత సాకుతో సరైన సమాచారం అందించలేదు. అరుదైన, అత్యవసర పరిస్థితుల్లో నిర్దిష్టమైన వర్తమానాలను అడ్డగించడానికి ప్రస్తుతం ఉన్న చట్టాల ఆధారంగా అవకాశం ఉంది. కానీ ఈ పని చేయడంద్వారా ప్రభుత్వం పాల్పడే మానవ హక్కుల ఉల్లంఘనకు బాధ్యతవహించి తీరాల్సిందే. ఇది ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు ప్రమాదకరం కావచ్చు. ప్రజాభిప్రాయాన్ని దిద్ది తీర్చే వారి మీద ప్రభుత్వం ఇలా నిఘా వేసి ఉంచడాన్ని ప్రశ్నించే హక్కు కూడా మనకు ఉంది.
26/11న ముంబైలో తీవ్రవాద దాడులు జరిగినప్పుడు గూఢచార వర్గాల వైఫల్యం తరవాత ప్రభుత్వం విస్తారమైన సమాచారాన్ని సేకరించి పెడ్తోంది. నిఘా వేసే సమాచారం సేకరించడం కోసం ప్రస్తుతం విపరీతంగా డబ్బు ఖర్చు పెడ్తోంది కూడా. విస్తృత ప్రజానీకం మీద నిఘా వేసి ఉంచడానికి ప్రత్యేక కేంద్రాలనూ ఏర్పాటు చేస్తోంది. జాతీయ గూఢచార గ్రిడ్ లేదా నాట్ గ్రిడ్, కేంద్ర పర్యవేక్ష్యక వ్యవస్థలు (సి.ఎం.ఎస్.), క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్స్ (సి.సి.ట్.ఎన్.ఎస్.) లాంటివి పోలీసు రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి ఉపకరిస్తున్నాయి. ఈ సమాచార సేకరణను సవాలు చేయడానికి ఎలాంటి ఏర్పాట్లూ లేవు. ఈ వ్యవస్థలను విస్తృతంగా వినియోగించుకోవడంవల్ల ఎవరి మీదైనా, ఏప్పుడైనా నిఘా వేసి ఉంచడానికి అవకాశం కలుగుతోంది. ఈ సమాచార నిధులు వాస్తవికం అయినాయి. అయినా మనం నిఘా వ్యవస్థను నియంత్రించడంలో ఓ దశాబ్దం వెనుకబడే ఉన్నాం. చట్ట సమ్మతి లేకుండా ఇలా సమాచారం సేకరించడం, కేవలం ప్రభుత్వ ఉత్తర్వుల ఆధారంగా సమాచారం సేకరించడం తీవ్ర ఆందోళన కలిగించే అంశమే. ఉదాహరణకు ఆధార్ కార్డు ను ఎలాంటి చట్ట సమ్మతి లేకుండానె ప్రభుత్వం అమలు చేస్తోంది. ఆధార్ కార్డులో ఉండే సమాచారాం దుర్వినియోగం కాకుండా నివారించడానికి ఉండవలసిన కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఏమీ లేవు. దీనివల్ల భద్రతకు ముప్పు కలుగుతోంది. బాధితులు దీన్నుంచి తప్పించుకోవడానికి అవకాశమేమీ లేదు.
రాజ్య వ్యవస్థ పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించాలి. గోప్యతా హక్కు అందులో ఒకటి. ఎన్.ఎస్.ఓ. గ్రూప్ టెక్నాలజీస్ లాంటి సంస్థలు ఇలాంటి సమాచారాన్ని వినియోగించుకోవడానికి అధికారం ఇవ్వడం హక్కులను బాహాటంగా ఉల్లంఘించడమే. నిర్దిష్ట విధానం అనుసరించకుండా వ్యక్తుల గోప్యతా హక్కును ఏ మాత్రం ఖాతరు లేకుండా దుర్వినియోగం చేయడానికి వీలు లేదు. తప్పనిసరి పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు మినహా ఈ హక్కుని ఉల్లంఘించడానికి వీలుండకూడదు. ఒక అవినీతి కేసులో చట్ట వ్యతిరేక పద్ధతులను అనుసరించి కేంద్ర దర్యాప్తు సంస్థ (సి.బి.ఐ.) సమాచారం సేకరించడానికి వ్యతిరేకంగా ఇటీవల బొంబాయి హైకోర్టు మంచి తీర్పు ఇచ్చింది. ఇలాంటి సాక్ష్యాన్ని అంగీకరించకపోవడంతో పాటు ఆ సమాచారాన్ని అంతటినీ తొలగించాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసులో దొంగ చాటుగా సమాచారం సేకరించడం తప్పనిసరి పరిస్థితుల్లో చేసిన పనేమీ కాదని, ఇది ప్రజల భద్రతకు ముప్పు తెస్తుందని కూడా కోర్టు వ్యాఖ్యానించింది.
ఇలా నిఘా వేయడాన్ని రాజకీయ ప్రయోజనాలకోసం కూడా ఉపయోగించుకుంటున్నారు. 2015లో ఒక హాకింగ్ బృందం (ఇటలీకి చెందిన ఒక నిఘా వ్యవస్థ నిఘా వేసి ఉంచింది) సేకరించిన సమాచారం వెల్లడైనప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోన్లను అడ్డగించే పరికరాలు సేకరించడానికి ప్రయత్నించినట్టు తేలింది. తెలంగాణ ముఖ్యమంత్రి తన ఫోన్ సంభాషణలకు సంబంధించిన సమాచారాన్ని దొంగచాటుగా సేకరిస్తున్నారని అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆ సమయంలో హోం మంత్రిగా ఉన్న రాజ్ నాథ్ సింగ్ కు ఫిర్యాదు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి సదరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి రాజకీయ ప్రత్యర్థి. మరో సందర్భంలో ఛత్తీస్ గఢ్ పోలీసులు ఎన్.ఎస్.ఓ. గ్రూప్ టెక్నాలజీస్ కు చెందిన వారిని కలుసుకున్నట్టు తేలింది. ఈ విషయంలో ప్రభుత్వం వాట్స్ ఆప్ నుంచి అదనపు సమాచారం అడిగింది కాని తన ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారన్న అంశాన్ని మాత్రం పట్టించుకోలేదు.
సమాచార హక్కు చట్టంతో సహా అనేక చట్టాల ప్రకారం పౌరులకు రక్షణ ఉన్నప్పటికీ జాతీయ భద్రతా వ్యవస్థలు చేస్తున్న పనులు మన ప్రజాస్వామ్యానికి విఘాతంగా పరిణమించాయి. ఈ భద్రతా వ్యవస్థలు సామాన్యులకు రక్షణ కల్పించడానికి బదులు అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతున్నాయి. భారత్ లో నిఘా వేసే పద్ధతిలో సత్వరం సంస్కరణలు ప్రవేశ పెట్టవలసిన అగత్యం ఉంది. పార్లమెంటులో 2019 నాటి వ్యక్తిగత సమాచార రక్షణ బిల్లుపై జరిగే చర్చలను జాగ్రత్తగా పరిశీలించవలసిన, దానికి సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు అందించాల్సిన అవసరం చాలా ఉంది. ప్రజా ప్రతినిధులు దాపరికం లేని విధానాన్ని అనుసరించాలని అడగాలి. ప్రస్తుత నిఘా విధానాన్ని నిలదీయాలి. రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరించే వారు బాధ్యతాయుతంగా మెదిలేటట్టు చేయగలగాలి. పెగాసస్ అంశంపై చర్చిస్తున్న సమాచార సాంకేతికతపై పార్లమెంటరీ కమిటీ తన దర్యాప్తును సత్వరం పూర్తి చేయాలి. సమగ్రమైన, ముందు చూపుతో కూడిన నివేదిక ఇవ్వాలి. ఇలాంటి సమయంలోనే మన ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంత పటిష్ఠంగా ఉందో తేలుతుంది. మన వ్యవస్థలు ప్రాథమిక హక్కులను పరిరక్షించాలి.