ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

విద్యార్థుల ఆత్మహత్యలు జాతికే నష్టం

.

ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి వివరాలు భిన్నంగా కనిపించవచ్చు. కానీ రెండు కారణాలు మాత్రం ఒకేలా ఉంటాయి. ఒకటి: ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థులలో ఎక్కువ మంది అణగారిన వర్గాలకు చెంది ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న వారే. రెండు: వారి ఫిర్యాదులను, సమస్యలను ఆ విద్యా సంస్థలు ఉపేక్షిస్తుంటాయి. కొంత మంది విద్యార్థులు ఆంత్మ హత్య చేసుకున్న తరవాతే వారి పేర్లు అందరికీ తెలిశాయి. అనిల్ మీనా, రోహిత్ వేముల, సెంథిల్ కుమార్, పాయల్ తాడ్వి, తాజాగా ఫాతిమా లతీఫ్ ఇలాంతి జాబితాలోని వారే. నజీబ్ అహమద్ జాడ ఇప్పటివరకు తెలియలేదు. ఫాతీమా లతీఫ్ నవంబర్ 9న ఆత్మహత్య చేసుకున్నారు. నిజానికి ఈ జాబితా వేలల్లో ఉంది. ప్రభుత్వ ప్రకటనల మేరకే 2014 నుంచి 2016 మధ్య దేశవ్యాప్తంగా 26,500 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. వారి మరణం వారి కుటుంబాలను, మిత్రులను కుంగ దీసింది. కొంతమంది ఎక్కువ మార్కులు సంపాదించలేకపోయామన్న ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటి వారి ఇబ్బందులను, బాధలను పట్టించుకోలేక పోవడం సిగ్గుచేటు.

అనవసరంగా ఆత్మహత్యల విషయంలో అర్థవంతమైన పాత్ర నిర్వర్తించలేని మీడియా ఒక కారణం. ఉదాహరణకు 2016లో హోమియోపతి కళాశాలకు చెందిన ముగ్గురు దళిత విద్యార్థినులు తమిళనాడులో ఆత్మహత్యకు పాల్పడ్డారు. అధిక మొత్తంలో ఫీజు చెల్లించలేనందుకు తమను "చిత్రహింసల"కు గురి చేస్తున్నారని, జీవించడానికి, చదువుకోవడానికి తమకు సరైన సదుపాయాలు లేవని వీరు తమ కళాశాలల అధికారులకే కాక ప్రభుత్వాధికారులకు కూడా మొరపెట్టుకున్నారు. తమలాంటి వారి గోడునైనా పట్టించుకుంటారన్న ఉద్దేశంతో చివరకు వారు ఆత్మహత్య చేసుకున్నారు. అదొక్కటే మార్గం అనుకున్నారు.

మీడియా వీరు ఆత్మహత్య చేసుకునే ముందు రాసిన లేఖలను విస్తృతంగా ప్రచారంలో పెడ్తుంది. అయినా వీరి గోడును పట్టించుకునే వారే ఉండరు. కొన్ని వారాల పాటు ఆత్మహత్యలు చేసుకున్న వారి లేఖలు సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా కనిపిస్తాయి. వాటి మీద కన్నీరు కారుస్తూ వ్యాఖ్యలు చేసే వారూ దండిగానే ఉంటారు. ఆ తరవాత అంతా మామూలుగానే సాగిపోతుంది. ఆ తరవాత అరుదైన సందర్భాలలో తప్ప పోలీసుల దర్యాప్తు ఎలా సాగుతోంది అని పట్టించుకునే వారే ఉండరు. ఈ ఆత్మహత్యల గురించి వివరాలు కనుక్కునే వారే ఉండరు. ఈ ఆత్మహత్యలకు కారణమైన వారి మీద చర్య తీసుకోవాలని అధికార వ్యవస్థ మీద ఒత్తిడి తీసుకురారు. మొదట హడావుడిగా మీడియాలో వార్తలు పుంఖానుపుంఖాలుగా వస్తాయి. సంచలనం కలుగుతుంది. తరవాత షరా మామూలే.

మీడియా కన్నా ఎక్కువగా ఉన్నత విద్యా సంస్థల అధికారులు ఏమీ పట్టించుకోరు. ఈ విద్యా సంస్థలు తమవి ఎంత గొప్ప వ్యవస్థలో ఊదరగొడ్తాయి. కానీ తమ విద్యార్థుల బాధలను మాత్రం పట్టించుకోవు. దలిత, ఆదివాసి, మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులు అష్టకష్టాలు పడి ఈ విద్యా సంస్థల్లో ప్రవేశిస్తారు. వీరిలో ఎక్కువ మంది ఇంగ్లీషు మాధ్యమంలో చదువుకున్న వారు కాదు. అందుకని వీరు ఇంగ్లీషు బోధనను సరిగ్గా అర్థం చేసుకోలేరు. తోటి విద్యార్థులతో ఇంగ్లీషులో మాట్లాడలేరు. వీరికి సహాయం చేసే వ్యవస్థలు ఏవైనా ఉంటే అవి ఎంత సమర్థంగా ఉంటాయి? షెడ్యూల్డ్ తరగతులు, షెడ్యూల్డ్ జాతులకు చెందిన విద్యార్థులపట్ల వివక్ష చూపుతారన్న వార్తలు వైద్య కళాశాలల నుంచి, ఇతర విద్యా సంస్థల నుంచి వస్తూ ఉంటాయి. ఈ విషయంలో ఏం చర్యలు తీసుకుంటారో, ఈ అంశం మీద వచ్చే నివేదికలు ఏమవుతాయో ఎవరికీ తెలియదు. వారి ప్రతిభను అంచనా వేయడానికి అంతర్గతంగా, ఇతరత్రా ఏం జరుగుతుందో, అధ్యాపకులు వీరి విషయంలో ఎలా వ్యవహరిస్తారో తెలియదు. వసతి గృహాలు, క్యాంటీన్లు/మెస్సులు, తరగతి గదుల్లో వీరు వివక్షకు గురవుతారు కనక వీరి మీద ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంటుంది. ఈ విషయాన్ని పట్టించుకునే వారే ఉండరు.

మద్రాసు ఇండియన్ ఇన్స్టిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుకుంటున్న తమ అమ్మాయిని కొందరు అధ్యాపకులు వేధించారని వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అందువల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపించారు. ఈ సంస్థలో గత సంవత్సరంలో అయిదుగురు ఇలా ఆత్మహత్య చేసుకున్నట్టు మీడియాలో వార్తలు వచ్చాయి.

తమ సంస్థలో విద్యార్థులకు సలహాలిచ్చి నచ్చ చెప్పే యంత్రాంగం ఉందని ఆ విద్యా సంస్థల వారు చెప్తున్నారు. వారికి ఆరోగ్య కేంద్రాలున్నాయని, వారికి నచ్చ చెప్పే అధ్యాపకులు ఉంటారని, వారికి సహాయపడే పద్ధతులు ఉన్నాయని అంటారు. సలహాలిచ్చే ఏర్పాటు, ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం వీరికి సూచించించే ప్రతిపాదనలున్నాయని  కూడా మీడియాలో వార్తలొచ్చాయి. ఇలాంటి మామూలు చర్యలకు మించిన ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. అది అత్యవసరం. రిజర్వేషను కల్పించి, సలహాలిచ్చి నచ్చ చెప్పే వారిని నియమించినంత మాత్రాన సరిపోదు. అత్యాధునిక ఉన్నత విద్య బోధించి, సహేతుకమైన, శాస్త్రీయమైన వైఖరిని అనుసరించేట్టు చేయవలసిన, పాండిత్యం సంపాదించడాన్ని ప్రోత్సహించవలసిన ఈ ఉన్నత విద్యా సంస్థలు ఎందుకు విఫలమవుతున్నాయో ఆలోచించాలి. ప్రత్యేకమైన నేపథ్యం నుంచి వచ్చే విద్యార్థులకే ఈ ఇబ్బంది ఎందుకు వస్తోందో గమనించాలి. తమ వర్గానికి చెందిన ఇతరులకు ఆదర్శప్రాయంగా మెలగాల్సిన ఈ విద్యార్థులు తమ ప్రాణం తీసుకోవడమే మేలు అని ఎందుకు అనుకుంటున్నారో కారణాలను అన్వేషించాలి. అనేక సవాళ్లను ఎదుర్కునే వారు ఈ ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం సంపాదించారు గదా?

ఇలాంటి కీలకాంశాలను గమనిస్తున్నామని ఊకదంపుడు మాటలు చెప్పడానికి బదులు దృష్టంతా "ప్రతిభ”, "కోటా"ల మీదే ఉంటోంది. అణగారిన వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకునే రాజకీయ పార్టీలు, మైనారిటీ వర్గాల వారు కూడా ఈ విషయాలను పట్టించుకుని ఆత్మహత్యలకు కారకులైన వారి మీద చర్య తీసుకోవాలని కోరడం లేదు. దీర్ఘకాలిక పరిష్కారాల గురించి ఆలోచించడం లేదు. అప్పటికప్పుడు ఆగ్రహమో, నిరసనో వ్యక్తం చేసినందువల్ల ఫలితం ఉండదు.

ఇలాంటి తెలివైన, ప్రతిభావంతులైన విద్యార్థులు ప్రాణాలు తీసుకోవడం జాతికి నష్టం. తక్షణ చర్యలు తీసుకోవడానికి సమయం ఆసన్నమైందని ఇంకెప్పుడు గుర్తిస్తారు?

Back to Top