ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

వివాదాస్పదమైన నేర గణాంకాలు

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

మన దేశంలో జాతీయ నేరాల రికార్డుల సంస్థ (ఎన్.సి.ఆర్.బి.) విడుదల చేసే సమాచారం ఎప్పుడూ అనుమానాలకే దారి తీస్తుంది. 1990ల నుంచి ఈ అనుమానాలు మరీ పెరిగిపోయాయి. ఎందుకంటే ప్రతి లక్ష మంది జనాభాకు నేరాల సంఖ్య తగ్గినట్టు చెప్తున్నారు. 2017వ సంవత్సరం నాటి నేరాల చిట్ఠాను ఎన్.సి.ఆర్.బి. ఇటీవలే విడుదల చేసింది. గత ఆరు దశాబ్దాల నుంచి ప్రతి ఏటా నేరాల జాబితా విడుదలవుతున్నప్పటికీ 2017 నాటి జాబితా మాత్రం ఇటీవలే విడుదల చేయడంతో అనుమానాలు మరింత పెరిగిపోయాయి. ఈ జాబితా 2017లోనే విడుదల కావాల్సింది. పైగా ఈ జాబితాను 2017లోనే ఎందుకు విడుదల చేయలేదు అని సమాచార హక్కు చట్టం కింద పెట్టుకున్న పిటిషన్లకు ఎన్.సి.ఆర్.బి. సమాధానం చెప్పకపోవడంతో అనుమానాలు ఇనుమడించాయి. ఈ జాప్యానికి కారణం ఏమిటో కూడా చెప్పలేదు. అర్థ దశాబ్దం కాలంలో నేరాలు 33% తగ్గడం మరింత విచిత్రం. 2010లో 576.99 నేరాలు నమోదైతే 2017లో అవి 388.6 కు తగ్గిపోయాయి. ఇది చాలా మందికి నమ్మశక్యంగా లేదు. జనాభా స్వరూపంలో మార్పు, ఆర్థిక పరిస్థితిలో మార్పు కూడా నేరాలు తగ్గడానికి కారణం అని నమ్మడానికి వీలు లేకుండా ఉంది.

మన దేశంలో నేరాలు తగ్గడం కూడా ప్రపంచ వ్యాప్తంగా నేరాలు తగ్గుతున్న ధోరణికి అనుగుణంగానే ఉంది. చాలా పారిశ్రామిక దేశాలు ఇదే అభిప్రాయంతో ఉన్నాయి. నేరాలకు సంబంధించిన వివరాలు పకడ్బందీగా నమోదవుతున్నాయి అంటున్నప్పటికీ ఈ తగ్గుదల మీద చర్చ కూడా విపరీతంగానే జరిగింది. ఐక్యరాజ్య సమితి అంతర్ ప్రాంతీయ నేర నేర బాధితుల సర్వే (ఐ.సి.వి.ఎస్.) లాంటి సంస్థల నుంచి అందే సమాచారంతో పోల్చి చూస్తే నేరాలు తగ్గుతున్న మాట వాస్తవమేనా అన్న అనుమానాలకు దారి తీస్తోంది. మన దేశంలో నేరాల చిట్ఠాకు సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమీ లేవు. ఐ.సి.వి.ఎస్. సర్వే 1992 నాటిదే. ఈ సంస్థ అంచనాలు ఎన్.ఆర్.సి.బి. చూపుతున్న నేరాల జాబితాకన్నా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ సంవత్సరానికి సంబంధించిన గణాంకాలు చూసినా తేడా స్పష్టంగా కనిపిస్తోంది.

భారత్ లో నేరాలు తగ్గడాన్ని సాధారణ చట్రాల పరిధిలో చూస్తే "భద్రతా ఊహలు" చూస్తే, భద్రతా నాణ్యతను, పరిమాణాన్నిబట్టి చూస్తే నేరాలు తగ్గినట్టు కనిపించిక మానదు. మన దేశంలో భద్రతకు సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలు పెరుగుతున్నాయి. 2020కల్లా ఈ మార్కెట్ 2.4 బిలియన్లకు చేరుతుందని 2017 నుంచి 2023 మధ్య ఇది 32% పెరుగుతుందని అంచనా. అయితే ఈ అంశాల ఆధారంగా ఎన్.సి.ఆర్.బి. గణాంకాలను పరిశీలించడం లోపభూయిష్టమే అవుతుంది. భద్రత కోసం చిన్న ఎలక్ట్రానిక్ పరికరాలను వాడడంవల్ల దొంగతనాలు, కార్ల దొంగతనాలు, వీధుల్లో జరిగే దొంగతనాలు మొదలైనవి తగ్గినట్టు కనిపించవచ్చు. అయితే ఎన్.సి.ఆర్.బి. నివేదికలో సైబర్ నేరాలకు సంబంధించిన లోపాలున్నట్టు కనిపిస్తోంది. ఒక వేళ సాంకేతికత పరికరాలు వాడడంవల్ల హింసాత్మకమైన నేరాలు తగ్గుతూ ఉంటే అణగారిన వర్గాల వారి మీద, మహిళల మీద, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ జాతుల వారి మీద నేరాలు ఎందుకు తగ్గడం లేదు? లేదా మహిళలు, ఎస్.సి.లు, ఎస్.టి.ల మీద జరిగే నేరాలు కొట్టొచ్చినట్టు కనిపించడంవల్ల, ఆ నేరాలకు సంబంధించిన ఫిర్యాదులు పెరగడంవల్ల ఈ వర్గాల మీద నేరాలు తగ్గినట్టు కనిపించడం లేదా? మరి మూకదాడులు, హత్యలకు సంబంధించిన వివరాలు కూడా ఎన్.సి.ఆర్.బి. జాబితాలో చేరి ఉండాలి కదా!

మూక దాడులు అంటే ఏమిటో అధికారిక నిర్వచనం ఏమీ లేనందువల్ల వీటికి సంబంధించిన వార్తలకు అంత విశ్వసనీయత లేదు అన్న ప్రభుత్వ వాదనను తోసిపుచ్చలేం. అయితే పాత నేరాలను, కొత్త నేరాలను కూడా ఎన్.సి.ఆర్.బి. పరిగణిస్తున్న తీరు మీద కూడా విశ్వాసం తగ్గుతోంది. "జాతి వ్యతిరేక శక్తుల నేరాలు" అన్నది ఇలాంటిదే. శాసనపరమైన పరిభాషలో "జాతి వ్యతిరేక నేరం" అన్నవర్గీకరణ ప్రామాణికమైంది ఏమీ కాదు. తమకు అనువైన, సూత్రబద్ధం కాని సమాచారాన్ని చేరుస్తున్నందువల్ల భారత్ లో నేరాలకు సంబంధించిన సమాచారం అంత విశ్వసనీయమైంది కాదు అన్న వాదన పొరపాటు కావడానికి ఆస్కారం లేదు.

ఈ పరిస్థితిలో దేశంలో నేరాలు తగ్గుతున్నాయి అన్న వాదన నిజం కాదు అన్న మాట నమ్మాల్సిన అవసరమే ఉంది. నేర న్యాయ విచారణ, పోలీసు దళాలకు సంబంధించిన వ్యవహార సరళి ఈ అనుమానాలను బలపరిచేదిగానే ఉంది. జరుగుతున్న నేరాలు నమోదు కాని పరిస్థితీ ఉంది. నేరాలకు సంబంధించిన సామాన్యుల అంచనా కూడా నేరాలు తగ్గుతున్నాయన్న భావనకు విరుద్ధంగానే ఉంది. నేరాలకు రాజకీయ, నేర విచారణా వ్యవస్థలు కారణం అయినట్టే సామాజిక-ఆర్థిక కారణాలూ ఉంటాయి. ఉదాహరణకు జనాభా స్వరూపం మారుతున్నందువల్ల నేర స్థాయిలో, సంఖ్యలో, నేర స్వభావంలో మార్పుకు కూడా కారణం అవుతుంది. ఈ సందర్భంలో అధికారిక విధానాలను మరింత సమగ్రంగా అంచనా వేయాలి. ఎందుకంటే నేర నివారణలో ఈ అంశాలు ప్రాధాన్యత వహిస్తాయి. ఇలాంటప్పుడు మనం నేరవిచారణా వ్యవస్థను మాత్రమే తప్పు పట్టి పరిపాలనా సంబంధ అంశాలను, సాధికారికతను పట్టించుకోకుండా ఉండే ప్రమాదం ఉంది. అందువల్ల ప్రభుత్వం వెల్లడించే నేరాలకు సంబంధించిన సమాచారాన్ని బేరీజు వేయడానికి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉండాలి. నేర బాధితుల గురించి సర్వే జరగాలి. ఈ సందర్భంలో రెండు అంశాలు గుర్తుంచుకోవాలి. నిర్ణయాలు తీసుకోవడానికి ప్రభుత్వ పాలనా తీరును పరిగణనలోకి తీసుకోవాలి. రెండవది ఈ సమాచారం ఎంత నాణ్యమైంది అన్న అంశాన్నిబట్టే తీసుకునే నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి. ఈ సమాచారం సవ్యంగా లేదు అనుకున్నంత మాత్రాన సరిపోదు. ఒక వేళ ఆ సమాచారం సవ్యంగా లేకపోతే ఎలా సవ్యంగా లేదో కూడా ఆలోచించాలి.

Back to Top