ప్రజాస్వామ్యంలో వాస్తవం, బూటకం
.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
పటిష్ఠమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో బూటకపు వార్తలు్ విరోధాభాసగా కనిపిస్తాయి. ఇలాంటి ప్రజాస్వామ్యంలో ఎంత కటువుగా ఉన్నప్పటికీ రాజకీయ నాయకుల మాటల్లో, సమాజంలోని ఇతర వర్గాల మాటల్లో వాస్తవం వ్యక్తం అవుతూనే ఉంటుంది. మీడియా ద్వారా కానీ, సంవాదపూర్వకమైన ప్రజాస్వామ్య వ్యక్తీకరణలో గానీ వాస్తవం దాపరికం లేకుండా ఉండాలి. ప్రామాణికమైన మీడియా అందజేసే సమాచారం వస్తు రీత్యా, బాధ్యత రీత్యా ఏ రకంగానూ విరూపం చేయకుండా వాస్తవమైంది అయి ఉండాలి. సామాజిక చైతన్యం కలిగించడంలో మీడియాకు బృహత్తర బాధ్యత ఉంది. ఈ వాస్తవిక సమాచారానికి పరిణామాలు ఉంటాయి. ప్రజాస్వామ్యంలో సంవాదానికి చోటివ్వడంలో మీడియాకు ప్రధానమైన బాధ్యత ఉంది. సమాజంలో వాస్తవం ఏమిటో చెప్పాలి. ఈ దృష్టితో చూస్తే బూటకపు వార్తలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమైనవి. అయినప్పటికీ మన దేశంతో సహా పశ్చిమ దేశాలలోనూ బూటకపు వార్తలు చెలామణిలో ఉన్నాయి.
బూటకపు వార్తలు అంటే అవాస్తవికమైన, విరూపం చేసిన సమాచారాన్ని, తప్పుడు సమాచారాన్ని అందజేయడం మాత్రమే కాదు. బూటకపు వాగ్దానాలు చేయడం, ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇలాంటి వాగ్దానాలు చేయడం, అపజయాలను బ్రహ్మాండమైన విజయాలుగా ప్రచారం చేయడం కూడా బూటకపు వార్తల కిందే లెక్క. అందుకే ప్రతిపక్షాలు తరచుగా చేసే ఫిర్యాదులకు విలువ ఉంటుంది.
సంస్థాగత అధికారం కావాలనుకునే వారు, లేదా తమ అధికారాన్ని సమర్థించుకోవాలనుకునే వారు బూటకపు వార్తలను ఆశ్రయిస్తారు. అయితే ఇలాంటి రాజకీయ నాయకులకు బూటకపు వార్తలతో పనేమిటి అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఇలాంటి వారు తమ అధికారాన్ని ఎందుకు సమర్థించుకుంటారు?
ఈ ప్రశ్నకు సులువుగా చెప్పే సమాధానం అమెరికాలోనూ, భారత్ లోనూ జరిగే ఎన్నికలే మంచి ఉదాహరణ. అధికార చదరంగంలో రాజకీయ నాయకులు తమ ప్రత్యర్థుల మీద పై చేయి సాధించి తక్షణావసారాల కోసం బూటకపు వార్తలను వినియోగించుకుంటారు. అధికారంలోకి వచ్చే పార్టీకి బూటకపు వార్తల, అరకొర సమాచారం అవసరం ఉంటుంది. అధికారం నిలబెట్టుకోవడం కోసం ఇతర రకాల మోసాలు అవసరం అవుతాయి. తాము అధికారంలో కొనసాగడానికి ఇలాంటి పార్టీలకు తాము సాధించిన విజయాల గురించి చెప్పుకోవడానికి ఏమీ ఉండదు కనక బూటక సమాచారాన్ని ఆశ్రయిస్తాయి. మరో రకంగా చెప్పాలంటే అధికారంలో ఉన్న పక్షాలు తగ్గుతున్న జీవన ప్రమాణాల గురించి, పెరుగుతున్న సామాజిక ఉద్రిక్తత గురించి, మార్కెట్ లో ఎగుడుదిగుళ్ల గురించి, పతనమవుతున్న ఆర్థిక సంస్థల గురించి మాట్లాడడానికి ఏమీ ఉండదు. నచ్చని ఈ వాస్తవాలను చెప్తే అధికారంలో ఉన్న పక్షానికి మద్దతు పోతుంది. ప్రతిపక్షాలు దాడికి దిగుతాయి. అందుకే బూటకపు సమాచారం ప్రత్యర్థులను కట్టడి చేయడానికి ఉపకరిస్తుంది.
అయితే అధికార పార్టీల ఉద్దేశాన్ని లోతుగా పరిశీలిస్తే ఈ వ్యవహారానికి అంత ప్రాధాన్యం ఇవ్వవు. వారు బూటకపు వార్తలను వినియోగించేది ఓటర్లను మాయ చేయడానికే. ఎందుకంటే ఓటర్లు ఎప్పుడు మద్దతిస్తారన్న నమ్మకం ఉండదు. సామాన్య మానవులకు సంబంధించిన అనేక అంశాల విషయంలో అధికార పార్టీ వైఫల్యాలు ఓటర్ల మద్దతు లేకుండా చేయవచ్చు. అందుకని ఓటర్లను పట్టించుకోకుండా ఉండడం కుదరదు. అందుకని బూటక కథలను ప్రచారంలో పెడతారు. నిజానికి బూటకపు వార్తలవల్ల నష్టం సత్యానికి కాదు. ప్రజలకే నష్టం. ప్రజలకు నిజం తెలియకుండా పోతుంది. అందుకే అమితమైన అధికార దాహం గల అలాంటి పార్టీలకు బూటకపు వార్తలు ఎప్పుడూ అవసరం అవుతాయి. ఆ పార్టీలకు బూటక ప్రచారమే ప్రధాన ఆధారం అవుతుంది.
బూటకపు వార్తలు ప్రచారంలో పెట్టడానికి అలవాటు పడినవారు సత్యమేదో అసత్యమేదో తెలుసుకునే విచక్షణా జ్ఞానాన్ని కూడా కోల్పోతారు. ఓటర్లు ఈ బూటకాన్ని ఎంత మేరకు నమ్ముతారు అన్న విషయం మీదే బూటకపు వార్తల విజయం ఆధారపడి ఉంటుంది. బూటకపు వార్తలను ప్రచారంలో పెట్టడం అంటే ఓటర్లకు తమను తాము పరిరక్షించుకునే హక్కు, స్వయంగా నిర్ణయాలు తీసుకునే హక్కు హరించుకు పోయేట్టు చేయడమే. ఇది స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడానికి విఘాతం కలిగిస్తుంది. సవిమర్శకంగా చూసే శక్తి లేకుండా చేస్తుంది. ప్రజలు స్వయంగా నిర్ణయాలు తీసుకునే శక్తి కలిగి ఉండడం అంటే అధికార పార్టీ కుట్రలకు తావు లేకుండా పోవడమే.
ప్రజాస్వామ్యంపై బూటకపు వార్తల పరిణామాలు ఎలా ఉంటాయి? బూటకపు వార్తలు చెలామణిలో ఉండడం అంటే ప్రజాస్వామ్యం సంక్షోభంలో ఉన్నట్టే. ప్రజలు ఆత్మవంచనకు పాల్పడేలా అధికార పార్టీలు బూటకపు వార్తలను ఎంతగా ఉపయోగించుకుంటే అది ప్రజాస్వామ్యాన్ని సంక్షోభంలో పడవేయడానికే కాక వ్యవస్థాపరమైన సంక్షోభానికి కూడా దారి తీస్తుంది. ఇతరుల అజ్ఞానాన్ని, శక్తి హీనతను ఉపయోగించుకోవడానికి చేసే ఏ ప్రయత్నమైనా అంతిమంగా విఫలం కాక తప్పదు.