ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

పేరుకు పోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

ప్లాస్టిక్ వినియోగాన్ని మానేయాలని రాజకీయ నాయకులు తరచుగా ప్రవచిస్తూ ఉంటారు. అయితే ఈ ప్రవచనాలకు కచ్చితమైన, దృఢమైన స్పందన మాత్రం ఇప్పటిదాకా కనిపించలేదు. ప్లాస్టిక్ కాలుష్యం నుంచి భారత్ ను 2022 కల్లా విముక్తం చేస్తామని ప్రధానమంత్రి ప్రకటించనైతే ప్రకటించారు. కానీ ఒక సారి వాడి పారేసే ప్లాస్టిక్ సామాగ్రిని ఇంతవరకు నిషేధించనే లేదు. ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే మందగమనంలో కూరుకుపోయింది కనక ఒక సారి వాడి పారేసే ప్లాస్టిక్ ను నిషేధిస్తే మరింత మందగమనం ఎదుర్కోవలసి వస్తుందని అని భయపడుతున్నారు. ఎందుకంటే పూర్తిగా నిషేధం విధిస్తే దాదాపు పది వేల పరిశ్రమలు మూతపడతాయి. వినియోగదారుల నుంచి కూడా నిరసన వ్యక్తం అవుతుంది.

ఒక సారి వాడి పారేసే ప్లాస్టిక్ ను నిషేధిస్తారన్న వార్తలు వచ్చినప్పటికీ అలాంటి ప్రయత్నాలు ఏమీ కనిపించడం లేదు. అసలు ఒక సారి వాడి పారేసేది ఏది అన్న విషయంలోనే స్పష్టమైన నిర్వచనం లేదు. ఆ ప్లాస్టిక్ వాడకం మీద సరైన మార్గదర్శకాలూ లేవు. ప్రత్యామ్నాయమూ చూపడం లేదు. వివిధ రాష్ట్రాలలో విడివిడిగా నిషేధం విధించినందువల్ల ప్రయోజనం కనిపించడం లేదు. వాడేసిన ఇలాంటి ప్లాస్టిక్ ను మళ్లీ వాడుకోవడానికి అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఒక సారి వాడి పారేసే ప్లాస్టిక్ ను వాడిన కొన్ని నిమిషాలలోనే పడేస్తారు. బడా ఇ-కామర్స్ కంపెనీలు, ఆహార పధార్థాలను పాక్ చేసి అమ్మే వారు ఈ ప్లాస్టిక్ ను ఎక్కువగా వాడతారు.

ఇలాంటి ప్లాస్టిక్ ను వాడడంవల్ల ఇటీవలి దశాబ్దాలలో వ్యర్థ పదార్థాల స్వరూపమే మారిపోతోంది. మన దేశంలో ప్రతి రోజు 25, 940 టన్నుల వ్యర్థ పదార్థాలు పోగు పడుతున్నాయి. దీనిలో 40 శాతాన్ని సేకరించరు, మళ్లీ ఉపయోగించరు. ఈ వ్యర్థ పదార్థం అంతా నీటిని కలుషితం చేస్తోంది లేదా కాలవలకు అడ్డంకిగా మారుతోంది. లేదా నేల కలుషితం అవుతోంది. ఈ ప్లాస్టిక్ వల్ల కాలుష్యం ఎంత తీవ్రంగా ఉందంటే తాబేళ్ల, గోవులవంటి పశువుల కడుపులోనో, గొంతులోనో ఈ ప్లాస్టిక్, సిగరెట్ పీకలు పేరుకు పోయి అవి మరణిస్తున్నాయి. సముద్ర జీవులకు కూడా ప్లాస్టిక్  ఉచ్చులా మారుతోంది.

మనుషుల కడుపుల్లోకి ప్రతి రోజు 250 ప్లాస్టిక్ ముక్కలు చేరుతున్నాయి. అంటే ఈ ప్లాస్టిక్ ఒక క్రెడిట్ కార్డు పరిమాణంలో ఉంటుంది. ప్లాస్టిక్ వ్యర్థాల సమస్యను సవ్యంగా పరిష్కరించనందువల్ల, ముఖం కడుక్కోవడానికి వాడే పదార్థాలు, టూత్ పేస్టుల ద్వారా మనుషుల శరీరంలోకి ప్లాస్టిక్ చేరుకుంటుంది. కుళాయిలు, ప్లాస్టిక్ సీసాలవల్ల ఈ వ్యర్థ పదార్థం చేరుతోంది.

ఈ వాస్తవాలన్ని తెలిసినా ప్లాస్టిక్ వాడకాన్ని విడనాడడం లేదు. వాడిన ప్లాస్టిక్ ను విసిరి పారేయడంతో పాటు ప్లాస్టిక్ తో చేసిన వస్తువులు అనువుగా ఉండడం కూడా దీనికి కారణం. వైద్యంలో ప్లాస్టిక్ వాడడం సురక్షితం అనుకుంటున్నప్పటికీ దీనివల్ల ఔషధాలూ కలుషితమవుతున్నాయన్నది వాస్తవం. ఎందుకంటే మన దేశంలో ప్లాస్టిక్ లో పాక్ చేయడం సురక్షితమైన పద్ధతిలో ఉండదు.

ప్లాస్టిక్ వాడడం సంస్కృతిలో భాగం అయిపోయింది. తాము వాడి పారేసే ప్లాస్టిక్ అంతిమంగా ఏమవుతోంది, దాన్ని శుభ్రం చేసే బాధ్యత మనదే గదా అన్న ఆలోచనే లేదు. ఇలాంటి జీవన విధానంవల్ల దిల్లీలోని గాజీ పూర్ లో వ్యర్థాలు వేసే గుంతలు 65 మీటర్ల ఎత్తున పేరుకు పోయాయి. శుద్ధి చేయని ఈ వ్యర్థ పదార్థాలు నీటిని కలుషితం చేస్తున్నాయి. ఈ కాలుష్యాన్ని దగ్ధం చేసినప్పుడు కాన్సర్ కు కారణం అవుతోంది.

వ్యర్థ పదార్థాలను మరో ప్రయోజనం కోసం ఉపయోగించుకోవాలంటే వ్యర్థాలను సేకరించేటప్పుడే వివిధ వ్యర్థాలను వేరు చేయాలి. అనేక పురపాలక సంస్థలు దీనికి సంబంధించిన నిబంధనలను అమలు చేయలేక పోతున్నాయి. వ్యర్థ పదార్థాలను ఏం చేయాలన్న విషయంలో నికరమైన పద్ధతులు కొరవడినప్పుడు వాటిని మళ్లీ వినియోగించుకోవడం కష్టం అవుతుంది. మురికి పేరుకుపోయిన ప్లాస్టిక్ ను శుద్ధి చేయడం కష్టం. చాలా ఖర్చుతో కూడుకున్న పని. సురక్షితం కూడా కాదు. శుద్ధి చేయడానికి ఎక్కువ నీరు అవసరమవుతుంది. ఆహార పదార్థలను పాక్ చేయడానికి అనేక పొరలున్న ప్లాస్టిక్ వినియోగిస్తారు కనక దాన్ని మళ్లీ ఉపయోగించుకోవడం కష్టం. ఈ వ్యర్థాలను సేకరించడానికి ఉత్పత్తి చేసే వారినీ బాధ్యుల్ని చేయాలి. మళ్లీ వినియోగించుకోవడానికి వాడే సాంకేతికతనూ మెరుగుపరచాలి. మన దేశంలో ప్లాస్టిక్ ను మళ్లీ వినియోగించడం అంటే మరింత నాసిరకం సరుకు తయారు చేయడమే.

వాడేసిన ప్లాస్టిక్ ను మళ్లీ వినియోగించుకునే అవకాశం తక్కువే ఉంటుంది. అదే ప్లాస్టిక్ ను పదే పదే వినియోగించుకోవడానికి పరిమితులున్నాయి. మరో సమస్య ఏమిటంటే విషపూరిత వ్యర్థ పదార్థాలు పేదల భూముల్లోకి, చేతుల్లోకి వెళ్తున్నాయి. వాణిజ్యం, జీవనోపాధి పేర ఈ పని చేస్తున్నారు. ప్లాస్టిక్ ను దిగుమతి చేసుకోవడం మీద నిషేధం ఉన్నా కంపెనీలు దిగుమతి చేసుకుంటూనే ఉన్నాయి. వాడేసిన ప్లాస్టిక్ ను సేకరించి మళ్లీ వినియోగించుకోవడం కన్న దిగుమతి చేసుకోవడమే చౌక అయినందువల్ల ఇలా చేస్తున్నారు.

అయితే ప్లాస్టిక్ ను మళ్లీ వినియోగించనవసరం లేకుండా వాడాలంటే రోడ్ల నిర్మాణానికి ఉపయోగించుకోవచ్చు. అయినా ఏదో ఒక రూపంలో ప్లాస్టిక్ ఈ భూ మండలం మీద ఉండనే ఉంటుంది. ప్లాస్టిక్ కు బదులు కాగితం, గుడ్డ, గాజు మొదలైనవి వాడవచ్చు. వాటివల్లా ఇబ్బందులు లేకపోలేదు. చెట్లకు సంబంధించిన పదార్థాన్ని ఉపయోగించి సేంద్రీయ పదార్థాన్నో, లేదా పోక చెట్టు నుంచి సేంద్రీయ ప్లేట్లనో తయారు చేయవచ్చు. అయితే అవీ పూర్తిగా జీవ విచ్ఛిన్నత ఉన్నవి కావు. బహిరంగంగా వాటిని పడవేస్తే ఈ సమస్య మరింత ఎక్కువ ఉంటుంది.

Back to Top