ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

ఆషామాషీగా శీతోష్ణ స్థితి పరిరక్షణా?

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

గత సెప్టెంబర్ 20 నుంచి 27 దాకా ప్రపంచ వ్యాప్తంగా శీతోష్ణ స్థితిలో మార్పులను అరికట్టాలని కోరుతూ సమ్మెలు జరిగాయి. ఈ ఉదంతం "మనకు ఈ భూగోళం మనకు పూర్వీకుల నుంచి అందలేదు. మన భవిష్యత్ తరాలనుంచి అరువు తెచ్చుకున్నాం" అనే నానుడిని గుర్తు చేస్తోంది. ఈ సమ్మెలు యువతరం శీతోష్ణ స్థితిలో మార్పులను నిరోధించడానికి ఏదో ఒక దేశంలో కాకుండా సకల దేశాలలో తగిన చర్యలు తీసుకోవలసిన అగత్యాన్ని తెలియజెప్తోంది. శీతోష్ణ స్థితిని పరిరక్షించడానికి ఉపక్రమించడం మన చారిత్రక కర్తవ్యం. ప్రకృతిని ఉపయోగించుకునే వారు, విచ్చలవిడిగా ఉద్గారాలను వెదజల్లే వారు ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించక తప్పదు. శీతోష్ణ స్థితిలో మార్పునకు తక్కువ బాధ్యత ఉన్న దేశాలు భవిష్యత్తులో తగిన చర్యలు తీసుకోవాలనీ, ఇప్పటికే విపరీతమైన ఉద్గారాలకు కారకులైన వారు తక్షణం చర్య తీసుకోవాలని అన్న వాదన ఉంది.

ఈ పరిస్థితిలో మన దేశంలోని నగరాలలో యువత శీతోష్ణ స్థితికి కలుగుతున్న విఘాతం గురించి పట్టించుకోవడం ఆహ్వానించ దగిన పరిణామమే. అయితే ఈ స్ఫూర్తిని పరిపాలనా బాధ్యతలు నిర్వర్తించే వారు ఏ మేరకు పట్టించుకుంటారన్నది సందేహాస్పదమే. శీతోష్ణ స్థితిని పరిరక్షించడానికి గత పది సంవత్సరాలుగా కోర్టులకు ఎక్కుతున్న వారు దీనిని మానవ హక్కుల వ్యవహారంగా పరిగణిస్తున్నారు. హక్కుల ఆధారంగా ఈ వ్యవహారాన్ని చూడడాన్ని నిశితంగా పరిశీలించవలసిందే.

ఉదాహరణకు సురక్షితమైన వాతావరణ పరిస్థితులు ఉంటే లబ్ధి పొందే వారి అంశాన్నే తీసుకోండి. మన దేశంలో ఈ ప్రతిపాదనకు అంతగా ఆదరణ ఉండే అవకాశం లేదు. బొగ్గు ఆధారంగా థర్మల్ విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయడం కన్నా తరగని ఇంధన వనరులైన సౌర శక్తిని, పవన విద్యుత్తును వినియోగించడంవల్ల బొగ్గు పులుసు వాయువు ఉద్గారాలు తగ్గుతాయన్నది నిజమే. అయితే దీనివల్ల ఉపాధి కల్పనకు అవకాశాలు ఉంటాయన్నది అనుమానమే. అభివృద్ధికి సమీకృత పరిశోధన అన్న పత్రంలో ప్రసిద్ధ నిపుణులు రూపొందించిన అధ్యయన పత్రంలో మన బొగ్గు ఉత్పత్తి రంగంలో ప్రతి ఉద్యోగి గంటకు 0.75 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారని 2014-15 లెక్కల ప్రకారం తేల్చారు. అంటే బొగ్గు గనుల్లో ఉపాధి కల్పన ఒక మెగా వాట్ సౌర శక్తి ఉత్పాదన కన్నా ఎక్కువ. దీనికి నాలుగు నెలలు 20 మంది పని చేయవలసి ఉంటుంది. ఇది అమెరికాలోని బొగ్గు ఉత్పత్తి కన్నా ఎక్కువే. 2011 లెక్కల ప్రకారం అమెరికాలో ఒక ఉద్యోగి 5.22 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు. అంటే శీతొష్ణ స్థితిని పరిరక్షించడానికి ఉపాధి కల్పనలో రాజీ పడాలా?

 

"అభివృద్ధికి సామర్థ్యం" అన్న అంశాన్ని దృష్టిలో ఉంచుకుని చూస్తే పరిశుభ్రమైన వాతావరణం, సురక్షితమైన శీతోష్ణ స్థితి, ఉపాధి కల్పన మొదలైన అంశాలకు కూడా ప్రధాన్యం ఇవ్వాలి. కానీ మనుషులకు సామర్థ్యంలో తేడాలు ఉంటాయి కనక వర్తమానానికే భవిష్యత్తు కన్నా ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అయితే దీనితో పాటు ఉండే ప్రాధాన్యాలూ ఉంటాయి. ఈ స్థితిలో ప్రజలు తమ హక్కులు పొందడానికి, ఆ మాటకొస్తే పరిశుద్ధమైన శీతొష్ణ స్థితి ఉండాలి అని అడగడంలో ప్రభుత్వ బాధ్యతే ఎక్కువ ఉంటుంది.

శీతోష్ణ స్థితి పరిరక్షణను కేవలం ఒక దేశానికి సంబంధించిన విషయంగా చూస్తే ప్రయోజనం ఉండదు. స్థానిక, అంతర్జాతీయ అంశాలను కూడా పరిగణించవలసిందే. ఈ దృష్టితో చూస్తే శీతొష్ణ స్థితి పరిరక్షణ కోసం జరిగిన సమ్మెలు, నిరసన ప్రదర్శనలు వదులుకున్న అవకాశాలుగానే మిగిలిపోతాయి. శీతోష్ణ స్థితి దిగజారిపోవడానికి ప్రభుత్వాన్ని దుయ్యబట్టే క్రమంలో శీతోష్ణ స్థితికి సంబంధించిన కొన్ని అంశాలను మౌలిక అంశాలను విస్మరించినట్టయింది. శీతోష్ణ స్థితి పరిరక్షణలో బాధ్యతలలో తేడాలు ఉంటాయి. భిన్నమైన బాధ్యతలూ ఉంటాయి. చారిత్రకంగా విపరీతమైన ఉద్గారాలకు పాల్పడుతున్న వారిని విస్మరించడంవల్ల ప్రయోజనం లేదు.

ఉదాహరణకు 1991 నుంచి 2012 వరకు హరిత గృహ వాయువుల ఉద్గారాల నిరోధంలో భారత్ పాత్ర దాదాపు లేనే లేదు. అందువల్ల ఈ నేపథ్యంలో 2030 నాటికి ఉద్గారాలను 30 నుంచి 35 శాతానికి తగ్గిస్తామనడం అత్యాశగా మిగిలిపోక తప్పదు. నిరసనకారులు ఈ లక్ష్యాల సాధ్యా సాధ్యాలను కూడా ప్రశ్నించి ఉండాల్సింది. ఎందుకంటే భారత జాతీయ ఆదాయం తగ్గిపోతోంది. పారిస్ ఒప్పందం ప్రకారం నిధులు సమకూర్చడం, సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చడంలో అనేక లోటుపాట్లు ఉన్నాయి. ఉద్గారాల తగ్గింపు విషయంలో విపరీతమైన ఉద్గారాలు వెదజల్లుతున్న దేశాలను, తక్కువ ఉద్గారాలున్న దేశాలను ఒకే గాటన కట్టడాన్ని కూడా నిరసనకారులు నిలదీసి ఉండాల్సింది.  

అయితే శీతోష్ణ స్థితి పరిరక్షణ గురించి యువ తరం పట్టించుకోవడం సంతోషించదగిన అంశం. ఉన్న పళాన నిరసనలకు దిగడంవల్ల ఒరిగేదేమీ ఉండదు. దీనివల్ల పరిపాలనాపరమైన అంశాలకు బాధ్యులైన వారిని బోనులో నిలబెట్టే అవకాశం ఉండదు.

Back to Top