ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

కనీస వేతన ప్రహసనం

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

కేంద్ర కార్మిక శాఖ మంత్రి దేశవ్యాప్తంగా రోజుకు కనీస వేతనం రూ. 178 ఉంటుందని ప్రకటించారు. కనీస వేతనాన్ని నిర్ధారించే ప్రమాణాలను ఖాతరు చేయకుండా, అధికారిక ప్రక్రియను పట్టించుకోకుండా ఈ కనీస వేతనం ప్రకటించారు. ఇదివరకు 2017 జూన్ లో కనీస వేతనం రూ 176 ఉంటుందని నిర్ధారించారు. 2015లో ఇది రోజుకు రూ. 160 ఉంటే పది శాతం పెంచి 176 చేశారు. పారిశ్రామిక కార్మికులకు వర్తించే ద్రవ్యోల్బణం ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.  ప్రభుత్వం కనీస వేతనం నిర్ధారించడంలో గత రెండేళ్లలో ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. అంటే ఇప్పుడు నిర్ధారించిన కనీస వేతనం వాస్తవ పరిస్థితిలో మునుపటికన్నా తగ్గుతుంది. అలాంటప్పుడు కనీస వేతనం నిర్ణయించడం ఎందుకు?

కనీస వేతనం, కార్మికులు ఉమ్మడిగా తమ కోర్కెలు సాధించుకునే అంశాలు వేతనాల స్థాయిని కూడా ప్రభావితం చేస్తాయి. జాతీయ కనీస వేతనాన్ని నిర్దేశించడంలో ప్రధాన ఉద్దేశం కార్మికులు పేదరికం నుంచి బయటపడి, ఆదాయాలలో, లేబర్ మార్కెట్ లో ఉండే వ్యత్యాసాన్ని తగ్గించడం. కార్మికుల, వారి కుటుంబాల అవసరాన్ని, ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని కనీస వేతనం నిర్ధారిస్తారు. అయితే ఇది కార్మికులు సంఘటితంగా సాధించుకునే అంశానికి సంబంధించింది కాదు. అది ఉన్న వేతనాలను పెంచుకోవడానికి సంఘటిత శక్తిని వినియోగించుకోవడం. ఇది ప్రధానంగా వ్యవస్థీకృత రంగానికే వర్తిస్తుంది. సమర్థవంతమైన కనీస వేతన విధానంవల్ల కనీస స్థాయిలో వేతనం సంపాదించే వారికి ప్రయోజనం కలుగుతుందని, వేతనాలు పెరిగితే గిరాకీ పెరుగుతుందని, మధ్యతరగతి వర్గం బలపడుతుందని, తద్వారా అందరికీ వర్తించే అభివృద్ధి సాధ్యం అవుతుందని తాజా ఆర్థిక సర్వేలో తెలియజేశారు.

అయితే ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోకుండా రూ. 178 కనీస వేతనం అని నిర్ధారించడం వాస్తవంగా కార్మికుల కొనుగోలు శక్తి తగ్గిస్తుంది. ఇది కార్మిక మహాసభల సిఫార్సులకు, 1992 నాటి సుప్రీంకోర్టు మార్గదర్శక సూత్రాలకు విరుద్ధమైంది. పైగా చట్టబద్ధంగా జరగవలసిన కనీస వేతన బోర్డు సమావేశం జరగకుండానె కనీస వేతనం నిర్ణయించేశారు. పైగా ఈ కనీస వేతనం నెలలో 26 రోజులకే వర్తిస్తుంది. అంటే నెలకు వచ్చేది రూ. 4,628 మాత్రమే.

కార్మికుడి కుటుంబం గురించి మాత్రమే కాకుండా వేతనాల స్థాయి, వాటి పంపిణీ, జీవన వ్యయం, కార్మికుల ఉత్పాదకత, ఆర్థికాభివృద్ధి రేటు మొదలైన అంశాలను కనీస వేతనం నిర్ణయించేటప్పుడు పరిగణనలోకి తీసుకుంటారు. కేంద్ర కార్మిక మంత్రి కనీస వేతనం రూ. 178 అని ప్రకటించడం ఈ కొలమానాలు వేటినీ పరిగణించినట్టు కనిపించదు. ఏక పక్షంగా నిర్ణయించేశారు. అన్నింటికన్నా మించి ప్రభుత్వమే నియమించిన నిపుణుల కమిటీ కనీస వేతనం రూ 375 నుంచి 447 దాకా (నెలకు రూ. 9,750 నుంచి రూ. 11, 622) ఉండాలని చేసిన సిఫార్సునే ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ నిపుణుల కమిటీ ఒక్కో మనిషికి ప్రామాణికంగా అవసరమైన కాలరీలు రోజుకు 2,700 అయితే దీన్ని 2,400 కు తగ్గించి కనీస వేతనాన్ని నిర్ణయించింది. 2016లో ఏడవ పే కమిషన్ సిఫార్సు చేసిన దానిలో ఇది నాలుగో వంతు మాత్రమే.

93 శాతం మంది అవ్యవస్థీకృత రంగంలో పని చేస్తున్న దేశంలో కేంద్ర ప్రభుత్వం ఇంత తక్కువ కనీస వేతనం నిర్ణయించడం అంటే దాని ప్రభావం శూన్యమే. సానుకూల సంపాదనా ప్రభావం, వేతనాల స్థాయి పెంచడం, ఇబ్బందులకు గురవుతున్న కార్మికులను ఆదుకోవడం అన్న ఉదాత్త లక్ష్యాలను ప్రకటించిన ప్రభుత్వం కనీస వేతనం నిర్ణయించే దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకూ కొరగాకుండా వ్యవహరించింది. అదీ గాక అన్ని రాష్ట్రాలలో కనీస వేతనం కేంద్రం సిఫార్సు చేసిన దానికన్నా ఎక్కువే ఉంది. అంటే ఇది రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయానికి విఘాతం కలిగించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది.

నయా ఉదార వాద ఆర్థిక విధానాలు అనుసరిస్తున్నప్పటి నుంచి గ్రామీణ ప్రాంతాలలో చిన్నా చితకా ఉత్పత్తికి విఘాతం కలిగింది. బతుకీడ్వ గలిగిన వ్యవసాయోత్పత్తికి అవకాశం లేకుండా పోయింది. దీనివల్ల గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు పెరిగాయి. ఈ దశలో కేంద్రం ప్రకటించిన కనీస వేతనం పిడుగుపడ్డట్టు అయింది. ఇది కనీస వేతనాల మీద, ముఖ్యంగా కార్మికుల మీద దాడి చేయడం కూడా. కార్మిక చట్టాల సంస్కరణల పేరుతో ఈ దాడి విపరీతంగా జరుగుతోంది. కార్మికులు దీర్ఘ కాలం పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులను వమ్ము చేస్తున్నారు. కార్మికుల ప్రయోజనాల కన్నా యజమానుల ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. పేదలకు అనుకూలమైన కనీస వేతనం నిర్ణయించబోమన్న సంకేతాన్ని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఇచ్చింది. ఈ కనీస వేతనాల వల్ల వేతనాలు, ఆదాయాల్లో వ్యత్యాసాలు మరింత పెరుగుతాయి. జీవన ప్రమాణాలు కుంచించుకు పోతాయి. సంక్షేమం గాలికి ఎగిరిపోతుంది.

Back to Top