ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

బడ్జెట్ లో ఆలోచనలు, ఆదర్శాలు

.

ఇటీవల ప్రతిపాదించిన 2019 కేంద్ర బడ్జెటు మీద అనేక మంది ఆర్థిక రంగ నిపుణులు నిశిత దృష్టితో చాలా వ్యాఖ్యానాలే చేశారు. అయినా బడ్జెట్ ఆచరణాత్మకమైంది అవునా కాదా అని పరిశీలించక తప్పదు. ఆనవాయితీ ప్రకారమే ఈ బడ్జెట్ లో కూడా వివిధ వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగానె ప్రతిపాదనలున్నాయి. అయితే వైరుధ్యాలూ లేకపోలేదు. పేదలకు అనుకూల సంస్కరణలు ప్రవేశ పెడ్తున్నామని ప్రభుత్వం చెప్తున్నా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, మధ్య తరగతి వారి కోసం కేటాయింపులు మాత్రం అరకొరగానే ఉన్నాయి. పేదలు రాజకీయంగా ప్రత్యేక వర్గం కాదని గ్రహించిన ప్రభుత్వం ఈ బడ్జెట్ ను నిర్దిష్ట అంశాల కింద విడగొట్టింది. ఏడాదికి రూ. రెండు కోట్లు సంపాదిస్తున్న సంపన్నులపై పన్ను పెంచారు కానీ పెట్టుబడులు ఆకర్షించడానికి కార్పొరేట్ రంగాన్ని మచ్చిక చేసుకోక తప్పలేదు. పార్లమెంటులో బొటాబొటి మెజారిటీ ఉన్న రాజకీయ పక్షాలకు ఇలా అందరినీ సంతృప్తి పరచాల్సిన అవసరం ఉండవచ్చు. అలాంటి ప్రభుత్వాలు రాజకీయ, సామాజిక ఒత్తిడులకు తలొగ్గవలసిన అవసరం ఉంటుంది. అందువల్ల సామాజిక అభ్యున్నతికి అనుగుణమైన బడ్జెట్ రూపొందిచవలసిన అగత్యం ఉంటుంది. కానీ సంపూర్ణమైన మెజారిటీ ఉన్న ప్రభుత్వాలకు తీవ్ర చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. వివిధ అవకాశాలను వినియోగించుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే ప్రభుత్వాలు తమకు మద్దతు ఇచ్చే వర్గాలను దృష్టిలో ఉంచుకుంటాయి. ముఖ్యంగా కొన్ని సామాజిక వర్గాల మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాయి. అదే సమయంలో ప్రైవేటు రంగ ప్రయోజనాలను గమనించి, రాజకీయ సుస్థిరతకు దోహదం చేసే వర్గాల మద్దతు సంపాదించవలసి వస్తుంది. అప్పుడే పెట్టుబడిని ఆకర్షించడం వీలవుతుంది. ఇలాంటి చర్యలవల్ల అసమానతలు పెరగక తప్పదు. ఈ అసమానతలు ఒక వర్గంలోనూ, వివిధ వర్గాల మధ్యా ఉండవచ్చు. అప్పుడు ఉన్న అవకాశాలను ఆచరణాత్మకంగా వినియోగించుకోవలసి ఉంటుంది. ఈ స్థితిలో ప్రభుత్వం పోటీ పడే వివిధ వర్గాల మధ్య సమతూకం సాధించడానికి దారుణమైన పరిస్థితిలో ఉన్న వారికి, కాస్త మెరుగ్గా ఉన్న వారికి మధ్య సమతూకం సాధించగలగాలి. మన దేశంలో 93 శాతం ఉపాధి అవకాశాలు అనియత రంగంలోనే ఉన్నందువల్ల భారత ఆర్థిక వ్యవస్థ ఈ సమతూకం సాధించలేక పోతోంది. మార్కెట్ పోటీ తత్వం కలిగించనందువల్ల ఉద్యోగాన్వేషణలో ఉన్న వారు సివిల్ సర్వీసులు, వృత్తి విద్యా కోర్సులు, ఏదో ఒక రకంగా ఉపాధి కలిగించే అంశాల మీదే దృష్టి కేంద్రీకరించవలసి వస్తోంది. ప్రభుత్వ రంగంలో అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాలు ఇవే. అలాంటి రంగాలలో ఉపాధి సాధించగలిగే అవకాశం ఏ కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. రిజర్వేషన్ల కావాలని వివిధ వర్గాలు కోరుతున్నందువల్ల ఆరోగ్యకరమైన పోటీకి అవకాశం లేకుండా పోతోంది.

మార్కెట్ నిస్సందేహంగా జన జీవితంలో అసమానతలకు కారణం అవుతోంది. వ్యవస్థలోనే అసమానతలు ఉన్నందువల్ల ఎంత పటిష్ఠమైన ప్రభుత్వం అయినా అసమానతలను నివారించలేక పోతోంది. అందుకని ప్రభుత్వం తాను కల్పించిన అసమానతలు తొలగించడానికి బదులు మార్కెట్ సృష్టించే అసమానతలను తొలగించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే మార్కెట్ సృష్టించే అసమానతలను ఎలా తొలగిస్తారు అన్నదే అసలు సమస్య. దీనికి ఒక మార్గం కోటాలు పెంచడం.

పంటలు పండనప్పుడు రైతులకు బీమా సదుపాయం కల్పించడం లాంటివి అంతిమంగా ప్రైవేటు బీమా సంస్థలకే మేలు చేస్తున్నాయి. పరిహారం కోరుతున్నదెవరు అనే దాన్నిబట్టి ప్రభుత్వం అంచనాలు వేస్తుంది. నిజానికి ప్రభుత్వం చేయవలసింది పరిహారం కోరే పరిస్థితి లేకుండా చేయడమే. ఉదాహరణకు రైతుల కడగండ్లు రూపు మాపడానికి ప్రభుత్వం తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. రైతులు పరిహారం కోరకుండా ఉండే పరిస్థితి కల్పించకపోవడంవల్లే ప్రభుత్వం పరిహారం చెల్లించక తప్పడం లేదు.

అందుకే ప్రభుత్వం పరిహారం చెల్లించే మార్గాన్ని అనుసరించడంవల్ల పోటీ పడే అవకాశం కల్పించలేక పోతోంది.

Back to Top