నివారించ గలిగిన నష్టం
.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
శిశు మరణం కన్నా జీవితంలో పెద్ద విషాదం ఏమీ ఉండదు. ఎందుకంటే మరణించిన శిశువు జీవితం అక్కడితో అంతం అవుతుంది. గత కొద్ది నెలలుగా బిహార్ లోని ముజఫ్ఫర్ పూర్ జిల్లాలో 153 మంది పిల్లలు మెదడువాపు వ్యాధివల్ల మరణించారు. ఈ వ్యాధి ఆ జిల్లాలో 1995 నుంచి ఉంది. 2010 నుంచి 2014 మధ్య ఈ వ్యాధితో దాదాపు వెయ్యి మంది పిల్లలు మరణించారు. ఈ విషయం తెలుసు కనక దీన్ని మట్టుబెట్టడానికి, కాకపోతే అదుపు చేయడానికి సత్వర చర్యలు తీసుకుని ఉండాల్సింది. దానికి బదులు ఈ వ్యాధి విజృభించినప్పుడల్లా మీడియా, ప్రజలు రొడ్డ కొట్టుడు రీతిలో వ్యవహరించడం చూస్తూనే ఉన్నాం. తమ బిడ్డలు మరణించినప్పుడల్లా వారి మృత దేహాలను మోస్తూ కంట్లో నీటి చుక్కైనా మిగలని తల్లిదండ్రుల చిత్రాలు చూస్తూనే ఉన్నాం. మరో వేపు ఈ వ్యాధి ప్రబలడానికి కారణాలను ఊహిస్తూ వచ్చే వార్తలకు కొదవలేదు. రాజకీయ వర్గాలు, ప్రధానంగా పాలక పక్షాలు ఈ వ్యాధి ప్రబలడానికి అనేకానేక కారణాలు వల్లిస్తుంటాయి. కాని దీంట్లో వ్యాధిని నివారించడానికి అనుసరించే వ్యూహాల జాడే ఉండదు. ఈ సారి కూడా పరిస్థితి దీనికి భిన్నంగా లేదు.
మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే మెదడు వాపు వ్యాధి సోకిన పిల్లలకు చికిత్స చేసే, లేదా ఆ ప్రాంతాలలో పర్యటించిన వైద్యులు ఇది నివారించదగిన వ్యాధే అంటున్నారు. లీచీ పళ్లు తిన్న పిల్లలకే ఈ వ్యాధి సోకుతోందని, పోషకాహార లోపం ఉన్న పిల్లలే ఈ పళ్లు తింటున్నారని అంటున్నారు. పోషకార లోపం లేని పిల్లలు ఈ పళ్లు తింటే ఇబ్బంది ఏమీ లేదట. ఈ వ్యాధి సోకిన మొదటి నాలుగు గంటల్లో గ్లూకోస్ అందించగలిగితే ప్రాణం కాపాడవచ్చు. కానీ పోషకాహార లోపం నివారించడానికి, వ్యాధి సోకిన పిల్లలకు అందించడానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో గ్లూకోస్ అందుబాటులో ఉంచడంలో ప్రభుత్వాలు చేస్తున్నది ఏమీ లేదు. ఈ విషయంలో ప్రభుత్వాలు సత్వరం తీసుకున్న చర్యలూ ఏమీ లేవు. ముజఫ్ఫర్ పూర్ జిల్లాలోని శ్రీ కృష్ణా వైద్య కళాశాల ఆసుపత్రిలో వైరస్ ల వల్ల సోకే జబ్బులను కనిపెట్టడానికి తగిన ప్రయోగశాలలే లేవు. పైగా ఆసుపత్రులలో పిల్లలను ఉంచడానికి తగినన్ని పడకలూ లేవు. ఇలాంటి స్థితిలో వ్యాధి సోకిన ఆరంభ దశలో చికిత్స చేయడానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఉండే వసతుల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనే లేదు.
వివిధ రాష్ట్రాలలో ఇలాంటి విషాదకర సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. 2017లో ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ జిల్లాలో అనేక మంది శిశువుల మరణాలు ఈ సందర్భంగా గుర్తుకు రాక తప్పదు. ఆ సందర్భంలో బాలలు అంటువ్యాధివల్ల మరణించారని అధికార వర్గాల వారు వాదిచారు. కాని ఆసుపత్రికి ఆక్సీజన్ సిలిండర్లు సరఫరా చేసే సంస్థకు బకాయిలు చెల్లించనందువల్ల ప్రాణవాయువు లేక అనేక మంది మృత్యువాత పడ్డారన్న వార్తలూ వచ్చాయి. ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ జిల్లాలోనే జపనీస్ మెదడు వ్యాపు వ్యాధి ఎక్కువగా సోకుతోంది.
వ్యాధి సోకిన పిల్లలను ఆసుపత్రిలో చేర్పించిన తరవాత కూడా మృత్యువాత పడడానికి వారిలో ఉన్న పోషకాహార లోపం, వారి తల్లిదండ్రుల పేదరికం, ఆసుపత్రుల్లో ఉన్న వసతులు మరీ నాసిరకంగా ఉండడం ప్రధాన కారణం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రాణ రక్షణకు ఉపయోగ పడే సదుపాయాలు, వైద్య పరికరాలు, డాక్టర్లు, నర్సులు అందుబాటులో ఉంచాలని ఆరోగ్య రంగంలో పని చేసే కార్యకర్తలు చాలా కాలంగా చెప్తున్నారు. అనుబంధ మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నప్పుడే ఇది సాధ్యం అవుతుంది. అందులో భాగంగానే వైద్య సిబ్బందికి మౌలిక సదుపాయాలు ఉండాలి. ఈ వెసులుబాట్లు కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. ఆరోగ్య వ్యవస్థ నానాటికీ క్షీణిస్తోంది. నిధులు లేక వ్యవస్థ అంతరించిపోయే ప్రమాదం ఏర్పడుతోంది. అన్నింటికీ మించి పోషకాహార సమస్యకు పరిష్కారం చూపాలి. పేద కుటుంబాలను ఆదుకునే ఏర్పాటు ఉండాలి. బిహార్ లో ఎదుగుదల లేని బాలల సమస్యను, బరువు తక్కువ ఉన్న బాలల స్థితిగతులను పట్టించుకోవలసిన బాధ్యత బీహార్ ప్రభుత్వానిదే. ముఖ్యంగా ముజఫ్ఫర్ పూర్ జిల్లాలో ఈ సమస్యను పరిష్కరించడానికి సత్వర చర్యలు తీసుకోవలసిన అగత్యం ఉంది.
కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సిబ్బంది ఆ ప్రాంతాలలో పర్యటించినప్పుడు రోగుల తల్లిదండ్రులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వీరు వెనక్కి వెళ్లిపోవాలని గట్టిగా కోరారు. ఆసుపత్రులలో పిల్లలకు వైద్యం చేసే సదుపాయాలు పెంచుతామని, వైరస్ లను కనిపెట్టే ప్రయోగశాల ఏర్పాటు చేస్తామని అప్పట్లో ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఇన్ని సంవత్సరాలుగా చేసింది ఏమీ లేదు. తల్లిదండ్రులకు కనిపిస్తున్నదల్లా అధికారుల నిర్లక్ష్యమే. ఇది ఒక్క ముజఫ్ఫర్ పూర్ కు పరిమితమైన సమస్య మాత్రమే కాదు.
వైద్య సేవల విషయానికి వస్తే తమను పట్టించుకునే నాథుడే లేడని పేదలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి సందర్భాలలో ఆ ఆగ్రహం డాక్టర్ల మీద వ్యక్తం అవుతోంది. వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడానికి డాక్టర్లే కారణం అని జనం భావిస్తారు. ప్రజా రంగంలోని వారు, ముఖ్యంగా మీడియా ఈ అన్యాయం, ఆగ్రహం గురించి ఆలోచించాలి. డాక్టర్ల మీద దాడులు జరిగినప్పుడు, జనం ఆగ్రహానికి గురైన సందర్భాల గురించి మీడియా రాసి ఊరుకుంటే సరిపోదు. నివారించగలిగిన అవకాశం ఉన్నప్పుడు ఒక్క శిశువు మరణించడాన్ని కూడా తేలికగా తీసుకోకూడదు. చర్య తీసుకునేట్టు చేయవలసిందే.