ఉపాధి కల్పన లెక్కల్లోని రహస్యం
.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
ప్రభుత్వ రంగంలో 2.4 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఉండిపోయాయని మీడియాలో వచ్చిన వార్తలనుబట్టి చూస్తే భారీ స్థాయిలో ఉద్యోగాలు కల్పించామని ఎన్.డి.ఎ. ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలోని డొల్ల తనం బయట పడ్తోంది. నియత రంగంలో ప్రభుత్వ రంగంలోనే ఎక్కువ ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు అందులో ఖాళీలు అపారంగా ఉండడం అంటే ప్రభుత్వం కల్పించామంటున్న ఉద్యోగాలపై అనుమానం రేకెత్తక మానదు. గత దశాబ్ద కాలంగా నియత రంగంలో ఉద్యోగాలను అనియత ఉద్యోగాలుగా మార్చేస్తున్నారు. అభివృద్ధి విధానాలలో ఇది ఒక భాగం అయిపోయింది. ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు నియతమైన ఉద్యోగాలను అనియత ఉద్యోగాలుగా మార్చడానికే అనువుగా ఉన్నాయి.
ఇలా నియత ఉద్యోగాలను అనియత ఉద్యోగాలుగా మార్చడం ప్రభుత్వ విధానం కాదని ప్రభుత్వం చెప్తోంది. ఉద్యోగం ఉన్న వారు, నిరుద్యోగులుగా ఉన్న వారి గురించి నేషనల్ సాంపుల్ సర్వే గణాంకాలను నిరాకరించి ప్రావిడెంట్ ఫండ్ ఖాతాల్లో చేరుతున్న వారి సంఖ్యనుబట్టి ఉద్యోగాల కల్పన పెరుగుతోందని ప్రచారం జరుగుతోంది. పొసగని లెక్కలను ప్రభుత్వం దాచి పెట్టడానికి ప్రయత్నం చేస్తోంది. దీనికి తోడు ప్రధానమంత్రి ఇటీవల పకోడీలు అమ్ముకునే వారు సైతం రోజుకు రెండు వందల రూపాయలు సంపాదిస్తున్నారు కనక వారికీ ఉపాధి ఉన్నట్టే అని అనియత రంగంలో స్వయం ఉపాధి చూసుకునే వారికి కూడా తామే ఉపాధి కల్పించినట్టు తప్పుడు అభిప్రాయం కలగాజేస్తున్నారు. అనియత రంగంలో ఉపాది, స్వయం ఉపాధి, పారిశ్రామికులు అన్న మాటలను కలగా పులగం చేసి ప్రభుత్వం వాడుతోంది. అనియత రంగంలో పని చేసే వారికి, స్వయం ఉపాధి చూసుకునే వారికి ప్రభుత్వం అమలు చేసే సామాజిక భద్రతా పథకాలు వర్తించవు. వీటి వల్ల కలిగే ప్రయోజనమల్లా తక్కువ ఆదాయాలు, ఏదో బతుకు ఈడ్వడానికి కావాల్సిన పని దొరకవచ్చునేమో కాని ఇవి పారిశ్రామికులు అన్న నిర్వచనం కిందకు రావు. విద్యా స్థాయి తక్కువ ఉన్నవారు, నైపుణ్యం తక్కువైన వారు అనియత రంగంలో పని చేస్తారు. వ్యవస్థీకృత రంగంలో పని చేయడానికి అవసరమైన సామర్థ్యం వీరికి సహజంగానే ఉండదు. విద్యా రంగంలో కూడా అనియత ఉపాధి అంటే అది ప్రమాదకరమైందే.
విద్యకు ప్రాధాన్యం ఉన్నప్పుడు లాటిన్ అమేరికా దెశాలలో విద్యావంతులు అనియత రంగాన్ని ఎంచుకుంటున్నారు. నైపుణ్యం ఉన్నా వారు అనియత రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. మన దేశంలో అనియత రంగంలో పని చేస్తున్న వారి పరిస్థితి ఇది కాదు. ఎలాంటి ఉద్యోగాలకోసం జనం చూస్తారు, వారి ఆదోళనలు, ఆకాంక్షలు ఏమిటి అనే అంశాన్ని గురించి 2017లో అభివృద్ధి చెందుతున్న దేశాల అధ్యయన కేంద్రం ఓ సర్వే నిర్వహించింది. ఎంత సంపాదిస్తున్నాం అనే దానికన్నా నికరమైన ఉద్యోగాలకే జనం ప్రాధాన్యత ఇస్తారని ఈ అధ్యయనంలో తేలింది. ఈ సర్వేలో పాల్గొన్న యువకుల్లో అయిదింట మూడు వంతుల మంది ప్రభుత్వోద్యోగాలకే ప్రాధాన్యం ఇచ్చారు. గత దశాబ్ద కాలంలో ఈ ధోరణి ఇలాగే కొనసాగుతోంది.
ప్రభుత్వోద్యోగాలు నమ్మకమైనవి, నికరమైనవి అయినందువల్ల ఉపాధి కల్పనలో ప్రభుత్వ రంగం నిర్వర్తించే పాత్ర కీలకమైందిగా ఉంటుంది కనక ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలకోసం ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఇటీవల రైల్వే శాఖలో 90,000 ఖాళీలకు 12 లక్షల 40 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. చదువుకున్న చదువుకు ఫలితం ఉంటుందన్న ఆర్థిక నీతి ఇందులో ఏమీ లేదు. దీనివల్ల చదివిన చదువు ఒకటైతే చెసే ఉద్యోగం మరొకటి అవుతుంది. దేశంలోని ప్రభుత్వ రంగంలో ఈ విధానమే కొనసాగుతోంది. చాలా కాలంగా ఇదే జరుగుతోంది. ప్రభుత్వ రంగంలో ఉద్యోగం సంపాదించడం ఖరీదైన వ్యవహారంగా తయారైంది. ఇది భరించలేని ఉద్యోగార్థులు విధిలేక అనియత రంగం మీద ఆధారపడక తప్పడం లేదు. స్వచ్ఛందంగానే వారు అనియత రంగాన్ని ఎంచుకుంటున్నారు అనడం సరైంది కాదు. అదీ గాక వేతన సంఘాలు వేతనాలను పెంచుతూ పోవడంవల్ల, ప్రభుత్వం జనాకర్షక విధానాలు అనుసరించడంవల్ల ఉద్యోగ నియమకాలు కూడా ఖరీదైన వ్యవహరంగా తయారైనాయి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉద్యోగ నియామకాలు భారంగా తయారైనాయి. కేంద్ర ప్రభుత్వోద్యోగులకు చెల్లించే మొత్తం చెల్లించడం రాష్ట్ర ప్రభుత్వాలవల్ల కావడం లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న ఆర్థిక వనరులు తక్కువ. అందుకే శాశ్వత ఉద్యోగాలు ఖాళీగా ఉండిపోతున్నాయి. ఈ ఉద్యోగాల స్థానంలో అనియత రీతిలో, దిన సరి వేతనంతో పని చేసే వారిని నియమించడం, కాంట్రాక్టు పద్ధతిలో నియమించడం ఎక్కువ అయింది. తద్వారా ప్రభుత్వాలు తాము ప్రజా సంక్షేమం కోసం పని చేస్తున్నామని చెప్పుకోగలుగుతున్నాయి.
నయా ఉదారవాద ఆర్థిక విధానాలు అనుసరిస్తున్న చోట అనియత రంగంలో ఉపాధి తప్పదు. మన దేశం దీనికి అతీతం కాదు. అనియత రంగంలో ఉపాధి కల్పించడం ఏదో ఒక ప్రభుత్వానికి పరిమితమైన అంశం కాదు. నయా ఉదారవాద విధానాలు అనుసరించే ప్రభుత్వాలకు ఇది వాటంగా ఉపయోగపడుతుంది. దీనివల్ల ప్రైవేటు రంగం అనియత ఉద్యోగుల నియామకంతో సరిపెట్టుకోగలుగుతుంది. రోజు కూలీల మీద ఎక్కువగా ఆధారపడుతుంది. తద్వారా ఖర్చులు తగ్గించుకోగలుగుతుంది. ఉత్పాదక పెందడం మీద కన్నా ఖర్చు తగ్గించడం మీద ప్రైవేటు రంగం శ్రద్ధ చూపడంలో ఆశ్చర్యం లేదు. పోటీలో నిలబడడానికి వారికి ఇది ఉపకరిస్తుంది. నయా ఉదారవాదులు చెప్పే ద్రవ్య పొదుపునకూ ఇది అనువుగా ఉంటుంది. తమ మీద భారం పడకుండా ఉండడానికి ప్రభుత్వమూ ఇదే విధానాన్ని అనుసరిస్తుంది. ఈ పరిణామాలకు జవాబుదారీ లేని సంస్థలు ఈ కారణంగా వచ్చే సామాజిక మార్పులకు సమాధానం చెప్పలేవు. నయా ఉదార వాద విధానాలు అనుసరించే చోట ఇది అనివార్యం.