ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

ట్రంప్ అమెరికా ద్రోహా?

ఇది అనూహ్యమైంది ఏమీ కాదు. ఒక రకంగా ఈ పరిణామం అదును చూసి జరిగిందే. 

హెల్సింకీలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, రష్యా అధినేత వ్లాదిమీర్ పుతిన్ మధ్య చర్చలు జరగడానికి సరిగ్గా మూడు రోజుల ముందు, జులై 13వ తేదీన అమెరికా డిప్యూటీ అటార్నీ జనరల్ రాడ్ రోజెన్ స్టీన్ 12 మంది రష్యా గూఢచారులు డెమోక్రాటిక్ నేషనల్ కమిటీ సర్వర్లను హాక్ చేసి, హిల్లరీ క్లింటర్ అమెరికా అధ్యక్ష స్థానానికి పోటీ చేసినప్పుడు ఆమె తరఫున ప్రచార బాధ్యతలు నిర్వహించిన జాన్ పోడెస్టా ఇ-మెయిళ్లను తస్కరించి ఆ సమాచారాన్ని వికీలీక్స్ కు అందజేస్తే అది వీటిని ప్రచురించింది అన్న విషయం బయట పెట్టారు. ఈ వ్యవహారాన్ని చూస్తే రష్యా అమెరికా ప్రజాస్వామ్యాన్ని పక్కదారి పట్టించిందని అనుమాన రహితంగా నిరూపితమైంది అని డెమొక్రాటిక్ పార్టీకి చెందిన వారు, పెద్ద మీడియా సంస్థలు గగ్గోలు పెడ్తున్నాయి.

2016లో అమెరికా అధ్యక్ష స్థానానికి జరిగిన ఎన్నికలలో రష్యా జోక్యం ఉంది అన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే దీనికి రుజువులు మాత్రం చాలా బలహీనంగా ఉన్నాయి. కాని సాక్ష్యాధారాలు సరిగ్గా లేవు అన్న విషయాన్ని డెమోక్రాట్లు గానీ, అమెరికా పెద్ద మీడియా సంస్థలు గానీ అంతగా పట్టించుకోకుండా రష్యా జోక్యం ఉందని ఊదరగొట్టాయి. ఈ ప్రచారం వికీలీలిక్స్ అధినేత జూలియన్ అసాంజ్ ను బోనెక్కడించడానికి ఉపకరిస్తుందనే భావించారు. ఈ వాదనను ఇప్పుడు మరింత గట్టిగా సమర్థించుకుంటున్నారు. కానీ ఈ వ్యవహారంలో అమెరికా గూఢచార సంస్థల డొల్ల తనం బహిర్గతమైంది. మరో వేపు అమెరికా గూఢచార సంస్థ సి.ఐ.ఎ. జనాన్ని చిత్రహింసలు పెట్టిందని, జాతీయ భద్రతా వ్యవస్థ (ఎన్.ఎస్.ఎ.) అమెరికా పౌరుల మీద నిఘా పెట్టిందన్న సమాచారం బయటకు వచ్చింది. జాతీయ భద్రతా వ్యవస్థ ఎడ్వర్డ్ స్నోడెన్ ను రచ్చకీడ్చింది. బండారాన్ని బయట పెట్టడం ద్వారా స్నోడెన్ నిజమైన ప్రజాస్వామ్య వాదినని నిరూపించుకున్నారు. అమెరికా గూఢచార సంస్థలు ఆయనను ద్రోహిగా ముద్ర వేశాయి. ఆయనకు 2020 దాకా రష్యాలో ఆశ్రయం ఇచ్చారు.

హెల్సింకీలో జులై 16వ తేదీన ట్రంప్ కు, పుతిన్ కు మధ్య జరిగిన చర్చల్లో అసలేం జరిగిందో అంతగా బయటికి రాలేదు. ఆ సమావేశ వివరాలను నివేదించిన సి.ఎన్.ఎన్. ఆంకర్ అక్కడ తాము గమనించింది "అమెరికా అధ్యక్షుడి సిగ్గుమాలిన ప్రవర్తన" అని చెప్పారు. తాను ఇంతకు ముంది ఎన్నడూ అమెరికా అధ్యక్షుడు ఇంత ఘోరంగా ప్రవర్తించడం చూడలేదని అన్నారు. 2016 నాటి అమెరికా ఎన్నికలలో రష్యా పాత్రను అమెరికా ప్రభుత్వం జీర్ణించుకోలేక పోతోంది. అమెరికా గూఢచార సంస్థలు చెప్పిన విషయాల కన్నా ట్రంప్ పుతిన్ మాటలనే ఎక్కువగా నమ్మారు. రెండు దేశాల అధ్యక్షుల సం యుక్త విలేకరుల సమావేశంలో ఒకప్పుడు రష్యా గూఢచార సంస్థ కె.జి.బి. అధికారిగా పని చేసిన పుతిన్ "ఇలాంటి వ్యవహారం" ఎలా ఉంటుందో తనకు తెలుసునని చెప్పారు.

ప్రస్తుత సి.ఐ.ఎ. డైరెక్టర్ జాన్ బెర్నాన్ గతంలో ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా పని చేశారు. ఆయన మితిమీరి ప్రవర్తించారు. న్యూ యార్క్ టైమ్స్ పత్రికలో రాసే థామస్ ఫ్రీడ్ మాన్ ట్రంప్ ను "రష్యా గూఢచారులకు చాలా ఉపయుక్తమైనవాడు" అని వ్యాఖ్యానించారు. ఆయన ఇంకా ఇలా రాశారు " నా తోటి అమెరికావాసులారా! మీరు ట్రంప్ తో, పుతిన్ తో ఉన్నారా లేక సి.ఐ.ఎ., ఎఫ్.బి.ఐ., జాతీయ భద్రతా సంస్థతో ఉన్నారా?" అని ప్రశ్నించారు.

ఉదారవాదులు, రాజకీయాల్లో మితవాదులైన వారు కూడా గూఢచార వ్యవస్థలను సమర్థించాలా అని అడగాల్సిన అవసరం ఉంది. ఈ వ్యవహారాలలో ప్రజలకు ఉండే అవకాశం ట్రంప్ ను లేదా అమెరికా గూఢచార సంస్థలను సమర్థించడానికి పరిమితం కావాలా? సి.ఐ.ఎ. అమెరికా రాజ్య వ్యవస్థలో మరో రాజ్య వ్యవస్థలా వ్యవహరిస్తుంది. ఇలాంటి గూఢచార సంస్థలే ఇరాక్ లో "మూకుమ్మడి మానవ విధ్వంసకర ఆయుధాలు ఉన్నాయి" అని తెగ ప్రచారం చేశాయి. ఆ సాకుతోనే ఇరాక్ మీద దాడికి దిగారు. ఈ గూఢచార సంస్థలే అమెరికా పౌరుల మీద నిఘా వేసి ఉంచుతాయి. స్నోడెన్ ఈ విషయాలనే బయట పెట్టారు. ఈ సంస్థలే అఫ్గానిస్థాన్, పాక్సిస్తాన్, లిబియా, సోమాలియా, యెమెన్ దేశాలలో చిత్ర హింసలకు కారణమయ్యాయి. డ్రోన్లను వినియోగించవలసిన పరిస్థితికి దారి తీశాయి. ఈ దాడుల్లో నిరాయుధులైన అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.

2016 నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రష్యా జోక్యం గురించి అమెరికా గూఢచార సంస్థలు చెప్పిన విషయాలకన్నా పుతిన్ మాటలనే ట్రంప్ ఎక్కువగా విశ్వసించారని ఖండిస్తున్న వారు ఉన్నారు. అమెరికా పాలకవర్గంలోనే అంతర్గత వైరుధ్యాలు ఉన్నాయి. రష్యా విషయంలో అమెరికా విదేశాంగ విధానం ఎలా ఉండాలన్న విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ట్రంప్ వ్యతిరేకులు రష్యా విషయంలో అమెరికా విదేశాంగ విధానం దూకుడుగా ఉండాలని వాదిస్తున్నారు. సోవియట్ యూనియన్ అంతరించడంతో పశ్చిమాసియా, యూరప్ సమాజం, మధ్య ఆసియాలో రాజకీయ భౌగోళిక విధానంలో శూన్యం ఆవహించింది. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని ఈ ప్రాంతాలలో పెత్తనం చేయాలని అమెరికా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో రష్యాను బలహీనపరచాలని చూస్తోంది. అనువైన చోటల్లా అమెరికా ప్రభుత్వం మితవాదులను, మతోన్మాదులను, తీవ్రవాద శక్తులను వినియోగించుకుని తన లక్ష్యాలు సాధించాలని ప్రయత్నిస్తోంది. ఇరాక్, సిరియా, ఈజిప్ట్, లిబియా లోనూ, కడకు ఉక్రైన్ లోనూ స్థానిక ఫాసిస్టులకు అనుకూలంగా వ్యవహరిస్తోంది. తిరోగమన ఇస్లాం వాదులను సమర్థిస్తోంది. ఈ విషయంలో ఎలా ముందుకు సాగాలన్న విషయంలో అమెరికా ప్రభుత్వంలో లుకలుకలు వ్యక్తం అవుతున్నాయి. రష్యా తో తాత్కాలిక సౌమనస్యం పాటించాలన్న ట్రంప్ ఎత్తుగడను అమెరికా ప్రభుత్వం లోని అత్యధిక సంఖ్యాకులు వ్యతిరేకిస్తున్నారు.

అయితే ఈ వైరుధ్యాలను కావాలని కప్పి పుచ్చుతున్నారు. ట్రంప్ ను ద్రోహిగా చిత్రిస్తున్నారు. అమెరికా జాతీయ ప్రయోజనాలను ట్రంప్ పుతిన్ కు తాకట్టు పెడ్తున్నాడని దుయ్యబడ్తున్నారు.

Back to Top