ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

సురక్షితమైన గర్భస్రావం హక్కు

సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న గర్భస్రావ చట్టం ఆమోదించాలి

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

గర్భం దాల్చిన తర్వాత 20 వారాలకు గర్భస్రావాన్ని అనుమతించాలని కోరుతూ దాఖలైన అనేక పిటిషన్లు సుప్రీం కోర్టు ఎదుట విచారణకు వచ్చిన వైనాన్ని చూస్తే 1971 నాటి వైద్యపరంగా గర్భస్రావ (ఎం.టి.పి.) చట్టాన్ని సత్వరం ఆమోదించాలని స్పష్టం అవుతోంది. గర్భస్రావం కేసులు న్యాయవ్యవస్థ పరిశీలనకు రావడానికి ప్రధాన కారణం ఈ చట్టంలో తల్లి ప్రాణానికి ప్రమాదం ఉంటేనే గర్భం దాల్చిన 20 వారాల తర్వాత గర్భస్రావం చేయవచ్చునన్న నిబంధన ఉండడమే. ఈ చట్టం గర్భస్థ శిశువులో ఉండే అస్వాభావికత, వైపరీత్యాలు గర్భిణుల శారీరక, మానసిక స్వస్థతపై కలిగించే ప్రభావాన్ని పరిగణలోకి తీసుకోదు. 20 వారాల తర్వాత కూడా గర్భంలో ఉన్న శిశువుకు ఉండే వైపరీత్యాలను కనిపెట్టడానికి కొంతకాలంగా అవకాశం ఉందన్న అంశాన్ని కూడా లెక్కలోకి తీసుకోదు. ఇలాంటి పరిస్థితిలో న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. ఒక్కో కేసు స్వభావాన్నిబట్టి న్యాయస్థానాలు డాక్టర్ల బృందం సిఫార్సుల ఆధారంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

ఈ చట్టానికి చేయవలసిన సవరణలు 2014 నుంచి పార్లమెంటు పరిశీలనలో ఉన్నాయి. గర్భస్థ శిశువులో వైపరీత్యాలు ఉన్నప్పుడు (ఇవేమిటో చట్టం నిబంధనల్లో ఉంటాయి) గర్భస్రావం చేయడానికి గర్భం దాల్చి ఎంతకాలం అయిందన్న విషయంతో సంబంధం లేదని, తల్లి ప్రాణానికి మూప్పు ఉన్నప్పటి పరిస్థితి ఏమిటి అన్న విషయాలు ఈ చట్టంలో ఉన్నాయి. ప్రతిపాదనలో ఉన్న ఈ సవరణలను ఆమోదిస్తే కోర్టుకెక్కాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే గర్భ స్రావం నమోదైన వైద్యుల సలహా మీదే ఆధారపడి ఉంటుంది.

ఈ సవరణలు "గర్భం తొలగింపు" అంటే ఏమిటో నిర్వచిస్తాయి. వైద్యపరంగా, శస్త్ర చికిత్స పరంగా గర్భస్రావం మధ్య తేడాను విడమరుస్తాయి. "నమోదైన వైద్యం అందించేవారు" అన్న నిర్వచనం కింద ఆయుర్వేద, యూనాని, సిద్ధ, హోమియో వైద్యులతో సహా నర్సులను, సహాయక నర్సులను, మంత్రసానులను కూడా చేరుస్తారు. ఇలాంటి వారిని నమోదైన వైద్యం అందించే వారి జాబితాలో చేర్చి గర్భస్రావాలు చేయడానికి అనుమతించడం వల్ల వైద్యపరమైన దుష్ప్రవర్తనకు దారి తీస్తుందని అలోపతి వైద్యులు వాదిస్తున్నారు. అయితే నిర్దిష్టమైన శిక్షణ, సర్టిఫికేట్ ఉన్న వైద్యం అందించే వారికే గర్భస్రావం చేసే అవకాశం ఉంటుందని ప్రభుత్వం చెప్తోంది. వైద్యం అందించడంలో శిక్షణ పొందిన మధ్య స్థాయి వారు ఈ విషయంలో సఫలం కాగలుగుతారని అధ్యయనాల్లో తేలింది.

ఈ సదుపాయం కల్పించడంవల్ల గర్భస్రావ సదుపాయం విస్తృతం అయ్యే అవకాశం ఉన్నా అది శూన్యంలో జరగకూడదు. సురక్షితం కాని గర్భస్రావాల వల్ల భారత్ లో రోజుకు పది మంది మహిళలు మరణిస్తున్నారు. భారత్ లో జరిగే గర్భస్రావాల్లో మూడింట రెండువంతులు సురక్షితం కానివే. ఇవి నియంత్రిత, అధీకృత ఆసుపత్రులకు, వైద్య వ్యవస్థకు ఆవలే జరుగుతున్నాయి. సదుపాయాలు అందుబాటులో లేనందువల్ల, నమోదైన వైద్యం అందించే వారు గర్భస్రావానికి అంగీకరించనందువల్ల, అనేకానేక సామాజిక కారణాలవల్ల, ఆర్థిక వెసులుబాటు లేనందువల్ల, అవగాహన కొరవడినందువల్ల, సామాజిక అపవాదులు మోయాల్సి రావడంవల్ల, సమాచారం అందనందువల్ల ఈ రకమైన గర్భస్రావాలు జరుగుతుంటాయి. ఈ కారణాలవల్ల చట్టబద్ధం కాని, సురక్షితం కాని గర్భస్రావాలు చేయించుకుంటూ ఉంటారు. అత్యవసరమైన గర్భనిరోధక సదుపాయాలను దుర్వినియోగం చేస్తారు. గర్భస్రావానికి ఉపయోగపడే మైఫ్ ప్రిస్టోన్, మిసోప్రొస్టాల్ వంటి మందులను వైద్యుల సిఫార్సు లేకుండా, డాక్టర్ ను సంప్రదించకుండా వాడుతుంటారు. దొడ్డిదారిన గర్భస్రావ సదుపాయాలను వినియోగించుకుంటారు. కొద్ది దేశాలలో ఉన్నట్టుగా 46 ఏళ్ల కింద చేసిన చట్టం భారత్ లో వచ్చినా అది సురక్షితమైన గర్భస్రావానికి వీలు కల్పించకపోవడంలో ఆశ్చర్యం లేదు. ఈ చట్టం పరిధిని విస్తరింపచేయడంతో పాటు అది అందుబాటులో ఉండడం, సురక్షితంగా, అధీకృతంగా, నియంత్రితంగా ఉండాలి.

1971నాటి చట్టంలో ఉన్న సదుపాయాలు బహుశః జనాభా నియంత్రణ అవసరాలు, అనియంత్రిత పద్ధతులలో, సురక్షితం కాని పద్ధతుల్లో, అధీకృత వైద్యుల కాని వారి దగ్గర గర్భస్రావం చేయించుకుని మరణించే వారి సంఖ్యను అదుపు చేయడానికి ఉద్దేశించినవి కావచ్చు. ఈ చట్టానికి ప్రతిపాదిత సవరణలు ఈ అంశంతో పాటు ఇంతకు ముందు ఉపేక్షించిన మహిళల నిర్ణయాన్ని, స్వయంప్రతిపత్తిని కూడా దృష్టిలో ఉంచుకోవడానికి ఉద్దేశించినవి. ఈ సవరణల ప్రకారం గర్భం దాల్చిన 12 వారాల తర్వాత గర్భస్రావం చేయించుకోవడానికి, ఇంతకు ముందు 20 వారాలు అన్న అంశాన్ని 24 వారాలకు పొడిగించడానికి తోడ్పడతాయి. అయితే ఇది గర్భస్థ శిశువులో ఉన్న వైపరీత్యాలు గర్భిణీల శారీరక, మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయని వైద్య సహాయం అందించే వారు నిర్ధారించినప్పుడే వర్తిస్తాయి. గర్భస్రావం చేయించుకోవడానికి నిర్ణయించుకునేటప్పుడు గర్భనిరొధక ప్రక్రియ విఫలమైందని అవివాహితులైన మహిళలు నిరూపించవలసిన అవసరం లేకపోవడం ఈ సవరణల్లో మరో ముఖ్యమైన అంశం. ఇది ఆహ్వానించదగిందే. 1971 తర్వాత సామాజికంగా, వైద్యపరంగా అనేక మార్పులు వచ్చినందువల్ల ఎం.టి.పి. చట్టం లాంటివి స్థగితమైన చట్టాలుగా ఉండిపోవాల్సిన అగత్యం లేదు.

Updated On : 13th Nov, 2017
Back to Top