అంతర్జాతీయ వాణిజ్యానికి అమెరికా మోకాలడ్డు
.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
బ్యూనస్ ఏర్స్ లో ఇటీవల డెసెంబర్ 10 నుంచి 13 దాకా ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యు.టి.ఒ.) 11వ మంత్రుల సమావేశంలో అమెరికా అనుసరించిన వైఖరి ఈ సంస్థకు విఘాతం కలిగించేలా ఉంది. ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకోవలసిన అంశాలపై ఏ అంగీకరమూ కుదరదని, సమావేశం ముగిసిన తర్వాత "మంత్రుల ఉమ్మడి ప్రకటన" ఏదీ ఉండదని అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లైట్జర్ ముందే చెప్పారు.
నవంబర్ లో వియత్నాంలో జరిగిన ఆసియా-పసిఫిక్ దేశాల సమావేశంలోనే డబ్ల్యు.టి.ఒ. మంత్రుల సమావేశంవల్ల ప్రయోజనం ఏమీ ఉండదని తేలిపోయింది. ఆ సమావేశానికి హాజరైన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ "అమెరికానే ముందు" అన్న వాదనను ముందుకు తీసుకొచ్చారు. బహుళ పక్ష ఒప్పందాలను తాము అంగీకరించబోమని, "పరస్పరం ప్రయోజనకరమైన" విధానాలనే అమెరికా అనుసరిస్తుందని స్పష్టం చేశారు. అమెరికా నాయకత్వం బలహీనంగా ఉన్నందువల్ల విపరీతమైన వాణిజ్య లోటు ఏర్పడిందని, అమెరికాలో ఉద్యోగాలు పోయాయని అన్నారు. కర్మాగారాలకు, పరిశ్రమలకు విఘాతం కలిగిందని చెప్పారు. డబ్ల్యు.టి.ఒ. అమెరికా విషయంలో అన్యాయంగా వ్యవహరించిందని ఆరోపించారు.
పత్తి ఎక్కువగా ఎగుమతి చేసే నాలుగు దేశాలైన బొనిన్. బర్కీనా ఫాసో, ఛాద్, మాలి దేశాలు స్వదేశీ మద్దతు విషయంలో రాజీ పడి మార్కెట్లు తమకు అందుబాటులో లేకుండా చేసి ఈ షరతులను అమెరికా అంగీకరించేట్టు చేశాయని రాబర్ట్ దెప్పి పొడిచారు. ఇది కపట వినమ్రతకు మాత్రమే నిదర్శనం. అమెరికా ప్రజలు జీవన్మరణ సమస్య ఎదుర్కుంటున్న సమయంలో రాబర్ట్ ఈ ధోరణి వ్యక్తం చేశారు. అలాగే భారత్ తో సహా ఇతర వర్ధమాన దేశాలకు అమెరికా ఇచ్చిన వాగ్దానాలను రాబర్ట్ భగ్నం చేశారు. ఆహార భద్రత సాధించడానికి ప్రభుత్వ స్టాక్ హోల్డింగ్ కు శాశ్వత పరిష్కారం కనుగొంటామన్న వాగ్దానాన్ని విస్మరించారు. దీనికి తోడు అమెరికా వాణిజ్య ప్రతినిధి డబ్ల్యు.టి.ఒ. ను కించపరిచారు. ఖాళీలను భర్తీ చేయడానికి అడ్డు తగిలారు. దీని వల్ల పరిష్కారం కావాల్సిన అంశాలు పెరిగిపోయాయి. డబ్ల్యు.టి.ఒ. మంత్రుల సమావేశాలలను, అక్కడ జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకుంటే వర్ధమాన దేశాల, పేద దేశాల విషయంలో స్వల్పజన పాలన విధానాన్ని అనుసరిస్తూ అమెరికా సంరక్షక పాత్రను పోషిస్తోంది. అనేక విషయాలలో యూరప్ సమాజం, జపాన్, కెనడా దేశాలు చైనాకు సంబంధించిన విషయాలలో కలిసికట్టుగా వ్యవహరిస్తున్నాయి.
దోహాలో బహుళ పక్ష చర్చలను కొంతకాలంగా అమెరికా అసలు పరిగణనలోకే తీసుకోవడం లేదు. డబ్ల్యు.టి.ఒ. మంత్రుల ముగింపు సమావేశంలో అమెరికా వాణిజ్య ప్రతినిధి "అమెరికా వాస్తవాల మీద ఆధారపడ్డ వ్యవసాయ సంబంధాలపై ఫలితాలు ఆశిస్తోంది. 16 ఏళ్ల కిందటి కాలదోషం పట్టిన చట్రాన్ని అనుసరించాలనుకోవడం లేదు" అని అన్నారు. అంటే దోహాలో అభివృద్ధిపై జరిగే చర్చలను తృణీకరిస్తున్నట్టే. ఆ చర్చల మూలాన్నే సవాలు చేస్తున్నట్టు అనుకోవాలి. డబ్ల్యు.టి.ఒ. బహుళ పక్ష విధానమే దిగదుడుపుగా తయారవుతున్న సందర్భంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం, ఎలక్ట్రానిక్ వాణిజ్యం, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అనుకూలమైన విధానాలు అనుసరించడం, దీని కోసం ఒకటికన్నా ఎక్కువ దేశాల మధ్య ఒప్పందాలు కుదరాలన్న విధానాలను అమెరికా ప్రకటించేసింది.
1946లో అమెరికా సుంకాలను ప్రకటించిన తర్వాత వాణిజ్యం, సుంకాలను తగ్గించడానికి ఒప్పందం (గ్యాట్) కుదిరిందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. దీని పర్యవసానంగా 1947 అక్టోబర్ లో భారత్ తో సహా 23 దేశాల మధ్య గ్యాట్ ఒప్పందం కుదిరింది. 53 దేశాలు కలిసి ఆమోదించిన హవానా ప్రకటనను అంగీకరించడానికి అమెరికా నిరాకరించింది. అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాలను పర్యవేక్షించడానికి అంతర్జాతీయ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి అమెరికా మోకాలు అడ్డం పెట్టింది. 1995 జవరి లో డబ్ల్యు.టి.ఒ. ఏర్పడే దాకా గ్యాట్ అమలులో ఉంది. 2017 అక్టోబర్ లో గ్యాట్ 70వ వార్షికోత్సవాన్ని విస్మరించారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత వాణిజ్య రంగంలో అంతర్జాతీయ వ్యవస్థ ఏర్పడడానికి చొరవ చూపిన అమెరికానే ఇప్పుడు ఆ వ్యవస్థను విచ్ఛిన్నం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది.
గ్యాట్ మీద అమెరికా వాణిజ్య వ్యవస్థలే పెత్తనం చెలాయించాయి. బహుళ పక్ష వాణిజ్య చర్చలు జరిగిన ప్రతి సారీ అమెరికా కొత్త వాణిజ్య విధానంలో కీలకమైన మార్పులు చేసింది. ఉదాహరణకు 1950ల మధ్యలో వ్యవసాయ రంగాన్ని గ్యాట్ నిబంధనల పరిధి నుంచి తొలగించారు. ఇది రోమ్ ఒప్పందానికి దారి తీసింది. ఆ తర్వాత యూరప్ సమాజ ఆర్థిక వ్యవస్థ ఏర్పడింది. ఆ దేశాలు ఉమ్మడి వ్యవసాయ విధానాలను అనుసరించాయి. 1958లో జౌళి, దుస్తుల అంశాలను గ్యాట్ పరిధి నుంచి తప్పించారు. జపాన్, అమెరికా ఈ నిర్ణయానికి పట్టుబట్టాయి. కాని 1986-94 మధ్య ఉరుగ్వే చర్చల్లో జౌళి, వస్త్ర రంగాలను మళ్లీ గ్యాట్ పరిధిలోకి తీసుకొచ్చారు. అందులో వాణిజ్య సేవలను, మేధో సంపత్తి హక్కులు, వాణిజ్య సంబంధ చర్యలను కూడా చేర్చారు. కాని అంతకు ముందులాగే ప్రజాస్వామ్య బాధ్యత విధానం కొరవడిన డబ్ల్యు.టి.ఒ. పై గుప్పెడు అభివృద్ధి చెందిన దేశాలు వాణిజ్యం, వాణిజ్య సంబంధ విషయాలపై ఆధిపత్యం కొనసాగించాయి. దీని వల్ల ప్రపంచంలోని ఆర్థిక రంగాలకు విఘాతం కల్గింది.
నిజానికి ట్రంప్ ప్రభుత్వం ముందే అసమానతలతో కూడిన ఈ వ్యవస్థలను విచ్ఛిన్నం చేయాలనుకోవడం లేదు. ఆ సంస్థకు సంబంధించిన నిబంధనలను తమకు అనుకూలంగా మార్చాలని ప్రయత్నిస్తోంది. అమెరికా పెట్టుబడిదారీ విధానం దిగజారుతోంది కనక అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై మళ్లీ పెత్తనం చెలాయించాలని ప్రయత్నిస్తోంది.