ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

బ్యాంకుల నడ్డి విరిచే ఎఫ్.ఆర్.డి.ఐ. బిల్లు

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

షెడ్యూల్డ్ కమర్సియల్ బ్యాంకుల నిరర్థక ఆస్తులు 2014 మార్చి నాటికి 2.6 ట్రిలియన్లు (2.6 వేల లక్షలు)అయితే అవి 2017 మార్చి నాటికి 8 ట్రిలియన్లకు (8 వేల లక్షలు) పెరిగాయి. అంటే బ్యాంకులకు రావలసిన బకాయిలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గత మూడు ఆర్థిక సంవత్సరాల కాలంలో ఉదారంగా 4.8 ట్రిలియన్ల మొండి బకాయిలను రద్దు చేసినా బ్యాంకుల నిరర్థక ఆస్తులు ఇంత భారీగా పెరిగాయి. వసూలు కాని బాకీలను వసూలు చేయడానికి 2016లో దివాలా స్మృతి తీసుకొచ్చినందువల్ల, 2017నాటి ఆర్థిక పరిష్కారం, డిపాజిట్ బీమా (ఎఫ్.ఆర్.డి.ఐ.) బిల్లు  ప్రతిపాదించినందువల్ల బాకీలను వసూలు చేయడానికి అవాకాశం ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ చెప్తోంది.

ఎఫ్.ఆర్.డి.ఐ. బిల్లు ద్వారా శక్తిమంతమైన ఆర్థిక పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. దీన్ని పరిష్కార వ్యవస్థ అంటారు. ఆర్థిక రంగంలో సేవలు అందించే వారి వైఫల్యాలను ఎదుర్కోవడానికి ఇది ఉపకరిస్తుందంటున్నారు. ఇది దివాలా స్మృతికన్నా భిన్నమైంది. దివాలా స్మృతిని ప్రైవేటు కార్పొరేట్ రంగం బకాయిలను వసూలు చేయడానికి ఏర్పాటు చేశారు. ఈ బాకీలు భరించరాని స్థితికి చేరుకున్నాయి. ఈ మొండి బాకీల ప్రభావం రుణాల అవసరం, రుణాలు ఇవ్వడంపై కూడా ఉంది. ఆర్థిక పరిష్కార విధానం బ్యాంకుల, ఆర్థిక సంక్షోభాన్ని నివారించడానికి తోడ్పడేలా ఏర్పాటు చేశారు. ఇది అంటువ్యాధిలా వ్యాపించకుండా చూడడం ఈ వ్యవస్థ ఏర్పాటు చేయడంలో ప్రధాన ఉద్దేశం. కాని ఎఫ్.ఆర్.డి.ఐ. ఈ సమస్యలను పరిష్కరించడం కన్నా సృష్టించే సమస్యలే ఎక్కువ ఉంటాయనిపిస్తోంది.

ఆర్థిక పరిష్కారాలు కనుగొనే అధికారం ఉన్న పరిష్కార వ్యవస్థ రుణగ్రస్థులను గట్టెక్కించడంతో పాటు సంప్రదాయ పద్ధతుల్లో ఆస్తులను స్వాధీనం చేసుకోవడం, బదిలీ చేయడం కోసం జి.20 దేశాల అధ్వర్యంలో ఆర్థిక సుస్థిరతా బోర్డు ఏర్పాటు చేసిన వ్యవస్థే. ఈ పరిష్కార సంస్కరణలు బ్యాంకుల నియంత్రణకు బేసల్ III కి ఉపయోగపడతాయి. వ్యవస్థాగతంగా ముఖ్యమైన బ్యాంకులకు, ఆర్థిక సంస్థలకు నగదు అవసరాలను తీర్చడానికి ఉపకరిస్తాయి. "ఇంత పెద్ద సంస్థలు" విఫలం కాకూడదు అన్న సూత్రం ఆధారంగా ఈ సంస్కరణలు ఉంటాయి. బలహీన పడిన ఆర్థిక సంస్థలను ప్రభుత్వం ఆదుకుంటుంది. 2007-2008 ఆర్థిక సంక్షోభ సమయంలో ఇలాగే చేశారు. నిజానికి ఆ సంక్షోభ ప్రభావం భారత్ మీద తక్కువ. ఎందుకంటే మన ఆర్థిక వ్యవస్థ ప్రభుత్వ రంగం మీద ఆధారపడింది. అందువల్లే మన ఆర్థిక వ్యవస్థ ఆ సంక్షోభాన్ని తట్టుకుని నిలబడగలిగింది. రిజర్వూ బ్యాంకు కూడా ఈ విషయాన్ని గుర్తించింది.

విచిత్రం ఏమిటంటే ఎఫ్.ఆర్.డి.ఐ. బిల్లు ప్రభుత్వ రంగ బ్యాంకుల, ఆర్థిక సంస్థల రుణాల పరిష్కారాన్ని నీరు గార్చడానికి ఉపయోగపడుతుంది. మన ఆర్థిక వ్యవస్థకు పునాది ఈ అంశమే కారణం. ప్రభుత్వ రంగ బ్యాంకుల, ఆర్థిక సంస్థల రుణ పరిష్కారంలో ఈ బిల్లు ప్రభుత్వ ప్రమేయం లేకుండా చేస్తుంది. దీనికి బదులు పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇది మరో రకంగా బ్యాంకుల ను సంక్షోభం నుంచి బయట పడవేయడానికి దారి తీయవచ్చు. అయితే అది బీమా సదుపాయం లేని డిపాజిట్లను వాటాల కింద మార్చిగానీ లేదా విక్రయించి గాని బయటపడేయడానికి మాత్రమే ఉపకరిస్తుంది. దీనివల్ల బ్యాంకులు దివాలా ఎత్తే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేసే వారిలో అనుమానాలకు తావిస్తోంది. ఈ బిల్లు చట్టం అయితే అస్థిరతకు దారి తీయవచ్చు.

ఆర్థిక సుస్థిరత బోర్డులో సభ్యత్వం ఉన్న అనేక వర్ధమాన దేశాలు ఇలా రుణ పరిష్కార వ్యవస్థలను ఏర్పాటు చేయడం లేదు. అలాంటివి ఏర్పాటు చేస్తే బ్యాంకులను నియంత్రించే రిజర్వూ బ్యాంకు, బీమా నియంత్రణా వ్యవస్థ, సెబీ, పింఛన్ నిధి నియంత్రణ-అభివృద్ధి సంస్థ లాంటివి ఎందుకూ కొరగాకుండా పోతాయి. లేదా విఫలమైన సంస్థలు దివాలా తీస్తాయి. ఆర్థిక సుస్థిరత కాపాడవలసిన బాధ్యత రిజర్వూ బ్యాంకు మీద చట్టబద్ధంగా ఉంది. అందువల్ల రుణ పరిష్కార వ్యవస్థకు, రిజర్వూబ్యాంకుకు మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తే అవకాశమూ ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఆర్థిక సంస్థలకు ఉన్న ముప్పేమిటో అంచనా వేయడంలో ఘర్షణ తలెత్తవచ్చు. ఈ మూప్పును అంచనా వేసే కొలమానాల్లో కూడా తేడా ఉండవచ్చు.

ఎఫ్.ఆర్.డి.ఐ. బిల్లు డిపాజిట్ల బీమా చట్టాన్ని తొలగించడానికి ఉపయోగపడుతుంది కాని బిల్లులో ఎంత ముప్పుకు హామీ ఉంటుందో లేనందువల్ల పరిష్కార వ్యవస్థలో అనిశ్చిత పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు డిపాజిట్లకు బీమా లక్ష రూపాయలు అన్నది 24 ఏళ్ల కింద నిర్ణయించింది కనక అత్యధిక బీమా ఎంతో నిర్ణయించవలసిన అగత్యం ఉంది.

పార్లమెంటులో అధికార పక్షానికి మెజారిటీ ఉండవచ్చు. కాని ఈ మెజారిటీ ఆసరగా ఎఫ్.ఆర్.డి.ఐ. బిల్లు లాంటి వాటిని ఆమోదింపచేసుకోవడానికి ప్రయత్నించడం సముచితం కాదు. అలాగైతే కీలకమైన ఆర్థిక రంగంపై తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. ఆర్థిక రంగ చట్టపర సంస్కరణల కమిషన్ ఆధారంగా ఈ బిల్లును రూపొందించారు. ఈ కమిషన్ "యాజమాన్యంలో తటస్థత" ఉండాలని సిఫార్సు చేసింది. అంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆర్థిక రంగంలో ప్రైవేటు పెట్టుబడితో పోటీ పడవలసి వస్తుంది. అయితే ఈ బ్యాంకులకు పోటీకి అనువైన పరిస్థితులు మాత్రం ఉండవు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రభుత్వం నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉండే మద్దతును నీరుగార్చడం వల్ల ఈ బ్యాంకులు మొండి బాకీలు విపరీతంగా పెరిగిపోయిన దశలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

అందువల్ల కొత్త రుణ పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న ఆలోచనను ప్రభుత్వం వెనక్కు తీసుకోవడమే ఉత్తమం. కనీసం మొండి బాకీల వ్యవహారం తేలేదాకా అయినా వేచి ఉండాలి. భారత ఆర్థిక వ్యవస్థకు, పరిస్థితులకు అనువైన పరిష్కార వ్యవస్థను రూపొందించాలి.

Back to Top