ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

మాయమైన అవినీతి

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

శామంతటినీ కుదిపేసిన 2జి కుంభకోణంలో సాక్ష్యాధారాలు దొరకనందువల్ల మొత్తం 20 మంది నిందుతులను నిర్దోషులుగా తేల్చడం ఆశ్చర్యకరం. అంతకన్నా విచిత్రంగా ఈ కుంభకోణం ఇంత త్వరగా ప్రజల మనసుల్లోంచి చెదిరిపోయిది. కేవలం పదేళ్ల కిందట మొబైల్ ఫోన్లకు అవసరమైన 2జి స్పెక్ట్రం కేటాయించడానికి “ఎవరు ముందు వస్తే వారికే” విధానం అనుసరించడం తీవ్ర వివాదం రేపింది. దేశంలోని వివిధ ప్రాంతాలలో మొబైల్ ఫోన్లలో ఇంటర్నెట్, మాట్లాడుకునే సదుపాయం కల్పించడం కోసం 122 లైసెన్సులు మంజూరు చేశారు. 

భారత్ టెలీకాం విప్లవం మొగదలో ఉన్నప్పుడు ఈ కేటాయింపు పెద్ద ముందడుగు అనుకున్నాం. ఇది టెలీకాం, సదుపాయాలు, మొబైల్ ఫోన్ల విస్తృతి పెరుగడానికి దోహదం చేసే చర్య ఇది. కానీ ఈ కేటాయింపు కాంగ్రెస్ హయాంలో అవినీతికి మారుపేరుగా మారింది. కాంగ్రెస్ నాయకత్వంలోని యు.పి.ఎ. ప్రభుత్వం అంటే అవినీతి పంకిలంలో కూరుకుపోయిన ప్రభుత్వం అన్న అభిప్రాయం కలిగింది. ప్రభుత్వ ఖజానాకు రూ. 1.73 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. ఈ కుంభకోణం యు.పి.ఎ. ప్రభుత్వ పతనానికి నాంది పలికింది.

 ఇందులో ఆరోపణలు ఏమిటో అందరికీ తెలుసు. మార్కెట్ ధరలకన్నా తక్కువకు యు.పి.ఎ. ప్రభుత్వం తమకు ఇష్టమైన వారికి స్పెక్ట్రం కేటాయించింది. లంచాలు పట్టి ఈ కేటాయింపులు చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీని వల్ల ప్రభుత్వ ఖజానాకు చేరవలసిన మొత్తం కనీసంగా రూ. 20,000 కోట్ల నుంచి అత్యధికంగా రూ. 1.73 లక్షల కోట్లు చేరలేదన్న అంచనాలు వేశారు. అప్పటి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వినోద్ రాయ్ ఈ లెక్కలు కట్టారు. ఈ స్పెక్ట్రం కేటాయింపులవల్ల టెలికాం కంపెనీలకు అపరిమితమైన లాభాల పంట పండిందనుకున్నారు.

ఆ సమయంలో టెలీకాం శాఖ మంత్రి, డి.ఎం.కె. నాయకుడు ఈ కుంభకోణంలో ప్రధాన పాత్రధారి అని భావించారు. ఆయన పార్టీలోని ఇతరుల మీద, కాంగ్రెస్ మీద కూడా ఆరోపణలు రేగాయి. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మీద కూడా అనుమానాలు తలెత్తాయి. ప్రాథమిక సాక్ష్యాధారాలను బట్టి ఏకపక్షంగా వ్యవహరించారని, అవినీతికి పాల్పడ్డారని, ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారని అన్నారు. అయితే ఇందులో ప్రభుత్వ ఖజానాకు కలిగిన నష్టాన్ని ఎక్కువగా అంచనా వేయడం వల్లే ఈ రగడంతా జరిగింది. యు.పి.ఎ. హయాంలో మహా కుంభకోణం కింద జమ అయింది. మౌలిక సదుపాయాలను, పేదరిక నిర్మూలన కోసం ఉద్దేశించిన నిధులను కాజేస్తున్నారన్న వాదనలు వినిపించాయి.

2జి. కుంభకోణంలో రూ. 1.73 లక్షల కోట్ల కుంభకోణం జరిగిందన్న అంచనా వేయడానికి నరేంద్ర మోదీ అధికారంలోకి రావడానికి సంబంధం ఉందని కొందరు భావిస్తున్నారు. ఇది పెద్ద కుట్ర అన్నారు. కుట్ర మాట ఎలా ఉన్నా ఈ వివాదం వల్ల ఒక విషయమైతే స్పష్టం అయింది. నిర్దిష్ట రాజకీయ పరిణామం సాధ్యమైంది. కాంగ్రెస్ నాయకత్వంలో అవినీతిని, ఇతర అనేక కుంభకోణాలను ఎలాంటి పరిశీలన లేకుండా కాంగ్రెస్ ను అపఖ్యాతిపాలు చేయడానికి వినియోగించుకున్నారు. దీనివల్లే “ఇండియా అగైన్స్ట్ కరప్షన్” ఉద్యమానికి అత్యంత ప్రచారం వచ్చింది.

 దేశాన్ని పీడిస్తున్న సకల సమస్యలకు అవినీతే కారణం అన్న సూత్రీకరణలు చేశారు. అవినీతి వ్యతిరేక ఉద్యమం సర్వరోగ  నివారిణి అని నమ్మారు. అంతమాత్రం చేత స్పెక్ట్రం కేటాయింపుల్లో అవినీతి లేదని చెప్తున్నట్టు కాదు. కాని ఈ ప్రచారం వల్ల మిగతా అంశాలన్నీ తెరమరుగయ్యాయి. పేదరికం, నిరుద్యోగం, ప్రజావసరాలు, వివక్ష, దౌర్జన్యం అన్నీ పెద్ద సమస్యలు కాకుండా పోయాయి.

యు.పి.ఎ. హయాంలో జరిగిన 2జి వ్యవహారం, ఇతర అంశాల వల్ల ఇతర పరిణామాలు కూడా ఉన్నాయి. కాగ్ లాంటి వ్యవస్థలను రాజకీయ ప్రయోజనాలకోసం ఉపయోగించుకోవడమే కాకుండా ప్రభుత్వ వ్యవస్థల్లో ఒక రకమైన పక్షపాత ధోరణి కూడా ప్రవేశించింది. మీడియాలో కూడే ఇదే ధోరణి అలుముకుంది. ప్రభుత్వ ఖజానాకు ఎక్కువ ఆదాయం సమకూరకుండా చేసి ప్రజా వనరులను కేటాయించడమే అవినీతికి మూలం అన్న ప్రచారం జోరుగా సాగింది.

2జి కేసును విచారించిన కోర్టు ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టు గౌరవానికి కూడా భంగం కలిగించింది. ఎందుకంటే 2012లో సుప్రీం కోర్టు యు.పి.ఎ. ప్రభుత్వం కేటాయించిన 2జి లైసెన్సులను రద్దు చేసింది. “ముఖ్యమైన ప్రభుత్వ వనురులను పళ్లెంలో పెట్టి కానుకగా” అందించారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

సుప్రీంకోర్టు కేవలం కేటాయింపులకు సంబంధించిన విధానాలనే పరిగణించిందని ఈ కేసును విచారిస్తున్న కోర్టు వ్యవహారం మీద ఏ ప్రభావమూ ఉండదనుకున్నారు. కానీ అది చెప్పినంత సులభం కాదు. నిందితుల మీద సి.బి.ఐ. ఎలాంటి సాక్ష్యాధారాలు అందించలేదన్నది ఈ కేసును విచారించిన కోర్టు తేల్చిన అంశం. ఇది అనేక ప్రశ్నలకు తావిస్తోంది. అందులో 2014 మే నుంచి అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వ నడవడిక మీద కూడా అనుమానాలు తలెత్తుతున్నాయి.

అవినీతిపరులను శిక్షిస్తామన్న హామీ ఆధారంగా మోదీ అధికారంలోకి వచ్చారు. కాని అవినీతి కేసుల్లో కెల్లా పెద్దదైన ఈ కేసులో నిందుతులకు శిక్ష పడేట్టు చేయడంలో మోదీ ప్రభుత్వం విఫలమైంది. అందువల్ల కాంగ్రెస్ అంటే అవినీతికి పర్యాయపదం అన్న మోదీ వాదనకు ఉన్న పదును కచ్చితంగా తగ్గుతుంది. ఈ కేసు నుంచి బయటపడినందువల్ల కాంగ్రెస్ తాను కోల్పోయిన బలాన్ని మళ్లీ సంపాదించగలుగుతుందో లేదో చెప్పలేం.

ఈ కేసులో అవినీతి రుజువు కాకపోయినప్పటికీ, అది అమాంతం అంతర్ధానం అయిపోయినప్పటికీ భారత ఆర్థిక, రాజకీయ వ్యవస్థలో అవినీతి, అయిన వారికి మేలు చేసే ధోరణి పాతుకుపోయాయన్న విషయంలో మాత్రం అనుమానాలకు తావు లేదు. న్యాయమైన, మెరుగైన సమాజాన్ని సృష్టించడానికి అవినీతికి వ్యతిరేకంగా పోరాడడం కీలకం అన్నది మాత్రం వాస్తవం.

Back to Top